అదే... ఏపీలో రిపీట్ అయితే.. ?!

Update: 2018-12-05 08:00 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు వంటి నాయ‌కుడు ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటారో చెప్ప‌లేం. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. తెలంగాణా ఎన్నిక‌ల్లో హోరా హొరీ పోరాడుతున్నారు. తానే తెర మీదికి తీసుకు వ‌చ్చాన‌ని చెబుతున్న ప్రజాఫ్రంట్ ను అదికారంలోకి తెప్పించుకోవడం ఆయ‌న‌కు చాలా ముఖ్యం. ఎంత ముఖ్యమంటే.. కేసీఆర్ ను ఓడించ‌డం, ఫామ్ హౌస్‌కు పంపించ‌డం క‌న్నా ముఖ్యం. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న చంద్ర‌బాబు.. తెలం గాణాలో ప్ర‌జాకూట‌మిని అధికారంలోకి తీసుకురావ‌డం ద్వారా త‌న హ‌వాను 2019లోనూ కొన‌సాగించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ప్ర‌చారాన్ని ఉధృతం చేశారు.

అదే పిలుపును ఏపీలో ఇస్తారా?

అదే స‌మ‌యంలో అటు కేసీఆర్‌పైనా.. ఇటు 2014లో త‌న పార్టీ టికెట్‌పై గెలిచి.. త‌ర్వాత పార్టీ మారి కేసీఆర్ చెంత‌కు చేరిపోయిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటి వారిపైనా బాబు విరుచుకుప‌డుతున్నారు. పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని, పార్టీలు మారిన వారిని న‌మ్మ‌రాద‌ని కూడా చెబుతున్నారు. నిజ‌మే..! చంద్ర‌బాబు పిలుపులో క‌సి, ఆవేద‌న అన్నీ ఉన్నాయి. దీనిని ప్ర‌జాస్వామ్య వాదులు ఒప్పుకొని తీరుతారు. నిజానికి ఆయ‌న చాలా అనుభ‌వ‌జ్ఞుడు కూడా ఈ అనుభ‌వంతోనే ఇలా వ్యాఖ్యానించి పిలుపు ఇస్తూ ఉండి ఉండ‌వ‌చ్చు. అయితే, తాను అధికారంలో ఉన్న చ‌క్రం తిప్పుతున్న ఏపీలోనూ మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అప్పుడు కూడా చంద్ర‌బాబు ఇంత పార‌ద‌ర్శకంగా, ఇదే రీతిలో ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇస్తారా? ఇలానే పార్టీలు మారిన వారిని ఓడించండి, త‌గిన విధంగా బుద్ధి చెప్పండి, పార్టీలు మారేలా ప్రోత్స‌హించిన పార్టీలను ఫామ్ హౌస్‌కు పంపండి- అని ప్ర‌చారం చేయ‌గ‌ల‌రా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

నికార్సయిన నాయకుడయితే...

చంద్ర‌బాబు ప‌దే ప‌దే ప్ర‌వ‌చించే నిఖార్స‌యిన నాయ‌కుడు అయితే, ఇదే పిలుపును ఏపీలోనూ ఇవ్వాల‌ని వారు కోరుతున్నారు. ఏపీలో అధికార పార్టీగా టీడీపీకి అవ‌స‌ర‌మైన బ‌లం ఉంది. అయినా కూడా ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యేల‌ను విడ‌త‌ల వారీగా 23 మందిని త‌న పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో కొంద‌రికి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. దీనిని చంద్ర‌బాబు చాలా సార్లు స‌మ‌ర్ధించుకున్నారు. ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భుత్వానికి ఎస‌రు పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలోనే తాను ప్రోత్స‌హించాన‌ని అన్నారు. అంటే.. ఏపీలో విప‌క్ష టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకోవ‌డం స‌రైంద‌నేన‌ని స‌మ‌ర్ధించుకోవ‌డంలో బాబు స‌క్సెస్ అయ్యారు. కానీ, ఇదే విష‌యంలో తెలంగాణాలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు బాబు కు ఇప్పుడు త‌ప్పుగా క‌నిపిస్తోంది.

అమాయక చక్రవర్తిగా....

హత్య చేసిన వాడిది ఎంత తప్పో, చేయించిన వాడిది అంతే తప్పు. అమ్ముడు పోయిన వారిది ఎంత తప్పో, కొనుక్కున్న వారిది కూడా అంతే తప్పు. అమ్ముడుపోయిన వారికి డబ్బు, కాంట్రాక్టులు, మంత్రి పదవుల ఆశ చూపి కొనుకున్నారని ఆరోపణలను ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు .. ఇప్పుడు తెలంగాణాలో ఏమీ ఎరుగ‌ని అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తిగా పార్టీలు మారిన వారిని.. ఫిరాయింపు హీరోల‌ను ఓడించాల‌ని పిలుపునివ్వ‌డంపై ఏపీలోని మేధావులు, రాజకీయ విశ్లేష‌కులు విస్తుపోతున్నారు. మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలోనూ చంద్ర‌బాబు ఇలాంటి పిలుపే ఇస్తే.. ఆయ‌న విజ్ఞ‌త‌ను అంగీక‌రించాల్సిందే! కానీ, ఇది సాధ్య‌మా?!!

Similar News