ప్రజాపతీ… పది రోజులు బతికించావుగా?

స్పీకర్ కమల్ నాధ్ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా రక్షించగలిగారు. మరో పది రోజుల సమయం దొరికింది. ఈ పదిరోజుల్లో కమల్ నాధ్ తన పార్టీ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించుకోగలిగితే [more]

Update: 2020-03-16 17:30 GMT

స్పీకర్ కమల్ నాధ్ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా రక్షించగలిగారు. మరో పది రోజుల సమయం దొరికింది. ఈ పదిరోజుల్లో కమల్ నాధ్ తన పార్టీ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించుకోగలిగితే ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కినట్లే. ఇదే పరిస్థితి పదిరోజులు కొనసాగితే మాత్రం కమల్ నాధ్ సర్కార్ కుప్పకూలిపోతుంది. అందరూ ఊహించిందే. సహజంగా స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. కాంగ్రెస్ వాది కావడంతో స్పీకర్ ప్రజాపతి కమల్ నాధ్ కు కొంత స్వల్ప కాలిక ఊరటనిచ్చారు.

ప్రసంగం ముగిసిన వెంటనే….

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే స్పీకర్ ప్రజాపతి ఈ నెల 26వ తేదీ వరకూ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ తీవ్రత కారణంగానే అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్ర్రకటించారు. దీంతో ఈ నెల 26వ తేదీ వరకూ కమల్ నాధ్ ప్రభుత్వం బలపరీక్షకు సమయం దొరికినట్లే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.

గవర్నర్ ఆదేశాలను సయితం….

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఈరోజు బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ను ఆదేశించారు. లిఖితపూర్వకంగా తెలియజేశారు. రాజీనామా చేస్తున్నట్లు 22 మంది ఎమ్మెల్యేలు తనకు తెలియజేశారని, అందువల్ల బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే బలపరీక్షను నిర్వహించాలని గవర్నర్ స్పీకర్ ప్రజాపతికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయితే స్పీకర్ ప్రజాపతి మాత్రం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సభను పదిరోజుల పాటు వాయిదా వేశారు. ఇందుకు కరోనాను సాకుగా చూపారు.

గవర్నర్ డెసిషన్ ఇలా…..

ఇప్పుడు గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను పది రోజుల పాటు తిరిగి క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. వాళ్లు వచ్చి తమ రాజీనామాలకు గల కారణాలను స్పీకర్ కు వివరిస్తే తప్ప వారిపై చర్యలు తీసుకోవడం కుదరదు. మొత్తం మీద స్పీకర్ ప్రజాపతి కమల్ నాధ్ ప్రభుత్వాన్ని మరో పది రోజుల పాటు బతికించారు. ఈ పదిరోజుల్లో ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారా? లేదా? అన్న దానిపైనే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. అయితే గవర్నర్ కమల్ నాథ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రేపటిలోగా బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. లేకుంటే మెజారిటీ లేదని భావించాల్సి ఉంటుందన్నారు. మరి దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News