గ్యారంటీగా గెలిచే స్థానాలివేనట....!!!

Update: 2018-12-08 13:30 GMT

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ఎన్నికలు సవాలుగా మారాయి. తెలుగుదేశం పార్టీ అధినేత దీనిపై ప్రత్యేకంగా ఆ పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు లెక్కల ప్రకారం దాదాపు ఎనిమిది స్థానాల్లో విజయావకాశాలున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన స్థానాల్లో పోటీ పోటీగా ఉందని, అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉందని చంద్రబాబు తనకు అందిన సమాచారాన్ని సీనియర్ నేతలతో పంచుకున్నారు. తెలంగాణలో కనీసం పది స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

13 నియోజకవర్గాల్లో.....

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 13 స్థానాల్లో పోటీ చేసింది. ప్రజాకూటమి ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేశాయి. మొత్తం 15 స్థానాలు కావాలని కోరినా చివరకు 13 స్థానాలే టీడీపీకి లభించాయి. ఇందులో కూడా ఒకటి డమ్మీ అభ్యర్థే. ఇబ్రహీం పట్నంలో చివరి నిమిషంలో టీడీపీ క్యాడర్ ను బీఎస్పీ అభ్యర్ధి మల్ రెడ్డి రంగారెడ్డికి పనిచేయాలని అగ్రనేతల నుంచి ఆదేశాలందాయి. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు, తెలంగాణ జనసమితి ఎనిమిది స్థానాలు, సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ లో.....

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో ఖమ్మం, అశ్వారావుపేట్, సత్తుపల్లి, మహబూబ్ నగర్ లో మక్తల్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో శేర్ లింగంపల్లి, కూకట్ పల్లి, సనత్ నగర్, రాజేంద్ర నగర్, ఉప్పల్, మలక్ పేట్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే వీటిల్లో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో గెలుపు అవకాశాలు తక్కువేనని అంచనాకు టీడీపీ నేతలు వచ్చారు. అలాగే ఖమ్మంలో రెండు స్థానాల్లోనే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిది స్థానాలపై ధీమా....

ఇక గ్రేటర్ హైదరాబాద్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కూకట్ పల్లి, సనత్ నగర్, శేర్ లింగంపల్లి, ఉప్పల్ ...నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు తమకు ఖాయమయిందన్న విశ్వాసాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్ తమ గెలుపునకు కారణమవుతుందని ఆనియోజకవర్గాల ఇన్ ఛార్జులు టీడీపీ అధినేతకు నివేదిక ఇచ్చారు. సనత్ నగర్, ఉప్పల్ లో భారీ మెజారిటీతో గెలుస్తున్నమని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. కూకట్ పల్లి, సనత్ నగర్, శేర్ లింగంపల్లి నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో బయటపడతామని ఆ పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. మొత్తం మీద చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News