నరసింహా...నీపైనే భారమా....?

Update: 2018-12-10 08:00 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం చాలా సంక్లిష్టంగా మారింది. ప్రజాకూటమి వ్యవహారం చూస్తుంటే ఆ పార్టీనేతల్లోనే పెద్దగా అంచనాల్లేనట్లు కన్పిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. అయితే సర్వేలు, వివిధ సంస్థల అంచనాలు అందరినీ తికమక పెట్టేవిగా ఉన్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి ప్రజకూటమిలో మేధోమధనం జరుగుతుంది. ఆ కూటమికి గవర్నర్ భయం పట్టుకుంది. అరకొర సీట్లతో తాము నెగ్గినా అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తే తమ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

అంచనాలు అందకపోవడంతో....

తెలంగాణ ఎన్నికలలో ఎన్నికలకు ముందే పొత్తులు కుదిరాయి. ముఖ్యంగా కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీ, సీపీఐ లు కలిసి ప్రజాకూటమిలా ఏర్పడ్డాయి. ఎవరి గుర్తుపై వారే పోటీ చేశాయి. పొత్తులు మాత్రం ఉన్నాయి. అయితే కౌంటింగ్ తర్వాత ప్రజాకూటమికి వచ్చిన స్థానాలను లెక్క కట్టకుండా పార్టీల వారీగా విడివిడిగా గవర్నర్ నరసింహన్ లెక్కిస్తారేమోనన్న అనుమానాలు ప్రజాకూటమి నేతల్లో బయలుదేరాయి. ఎవరికి అంచనాలు అందకపోవడం, ఎవరికీ ఆశించిన స్థానాలు దక్కే అవకాశాలు లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ బాట పట్టారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

కెమిస్ట్రీ బాగా ఉండటంతో.....

రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పెండింగ్ లో ఉండటంతో గవర్నర్ ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం నియమించలేదు. అయితే గవర్నర్ నరసింహన్ కు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుల మధ్య కెమిస్ట్రీ బాగా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రతి విషయంలోనూ గవర్నర్ తో కేసీఆర్ చర్చిస్తారు. గవర్నర్ ను తగిన రీతిలో కేసీఆర్ గౌరవిస్తారు. పలు సందర్భాల్లో గవర్నర్ నరసింహన్ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు జల్లుకురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకయిలే ఏకంగా కల్వకుంట్ల ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కూడా గవర్నర్ అన్నారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరంకూడా వ్యక్తం చేశారు.

ముందరకాళ్లకు బంధం....

ఈపరిస్థితుల్లో ప్రజాకూటమి నేతలకు గవర్నర్ పై అనుమానం బయలుదేరింది. అందుకే ఆయనను కలవనున్నారు. గవర్నర్ ను ముందుగా కలసి ప్రజాకూటమిని ఒక పార్టీ కింద లెక్కేసి అధిక స్థానాలున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కూటమి నేతలు గవర్నర్ ను కోరనున్నారు. గవర్నర్ పై అనుమానం ఉన్నందునే తాము ముందుకు కలుస్తున్నామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా రేపటి లెక్కింపులో ఎన్ని స్థానాలు వస్తాయో తెలియని ప్రజాకూటమి ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ ను కలవనుండటం చర్చనీయాంశమైంది. గవర్నర్ కీలకం కనుక ఆయన ముందరకాళ్లకు బంధాలు వేసేందుకే కూటమి నేతలు నరసింహన్ ను కలవనున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News