గంటా గ్యాంగ్ కు గండిపడుతోందా....!!

Update: 2018-12-16 00:30 GMT

ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రోద్బలంతో. 2009 ఎన్నికల వేళ విశాఖ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా నాడు తన పదవికి రాజీనామా చేసి మరీ ప్రజారాజ్యంలో చేరిపోయారు. అంతే కాదు. విశాఖ జిల్లా బాధ్యతలను కూడా చేపట్టారు. జిల్లాలో ఆనాడు ప్రజారాజ్యం ఎమ్మెల్యే అభ్యర్ధులను కూడా గంటా దగ్గరుండి ఎంపిక చేశారు. అలా వచ్చిన వారే అప్పట్లో భీమునిపట్నం నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు. తొలిసారే గెలిచి ఎమ్మెల్యే అయిపోయిన ముత్తంశెట్టి 2014 వరకూ గంటాతో బాగానే ఉండేవారు. ఎపుడైతే గంటా భీమిలీ సీటు కోరుకున్నారో అప్పటి నుంచి మొదలైన గొడవ బాగా ముదిరి ఇపుడు ఇద్దరి మధ్యనా దూరాన్ని పెంచేసింది.

నాడు ద్వేషించిన అయ్యన్నతోనే...

నాడు ముత్తంశెట్టిని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వేషించేవారు. ఆయన గంటా క్యాంపులో ఉన్నారని అక్కసు ప్రదర్శించేవారు. ముత్తంశెట్టి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తూ అయ్యన్నని కలవడానికి ఇంటికి వెళ్తే అయ్యన్న పెద్దగా స్పందించకపోగా గెలుపు విషయంలోనూ అంతగా సహకరించలేదని ప్రచారం జరిగింది. అలాంటిది ఇపుడు అయ్యన్న, ముత్తంశెట్టి చెట్టాపట్టాలు వేసుకుంటున్నారు. కలసి కార్యక్రమాలు చేస్తున్నారు. గురు శిష్యుల్లా మెలుగుతున్నారు. మరోవైపు గంటా అంటే అనకాపల్లి ఎంపీ గరం గరం అవుతున్నారు.

గంటాపై పైచేయి కోసం....

జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకూ గంటాదే పై చేయిగా ఉంటోంది. సీనియర్ మంత్రిగా ఉన్నా కూడా అయ్యన్న ఆధిపత్యం ఎక్కడా చెల్లడంలేదు. దాంతో రూట్ మార్చిన అయ్యన్న గంటా మనుషులనే తన వైపు తిప్పుకుని కొత్త రాజకీయానికి తెర తీశారని అంటున్నారు. ఫలితంగా ముత్తంశెట్టితో పాటు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా అయ్యన్నతో సఖ్యతగా ఉంటున్నారు. మరో వైపు రూరల్ జిల్లాలో బలం పెంచుకున్న అయ్యన్న గంటాని ఢీ కొట్టేందుకు ముత్తంశెట్టికి సహకరిస్తూ అర్బన్ జిల్లాలోనూ హవా చాటాలనుకుంటున్నారు. భీమిలీ నుంచి పోటీకి రెడీ అవుతున్న ముత్తంశెట్టికి ఇపుడు అయ్యన్న అశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యగా గంటాకి టికెట్ రాకుండా చేయాలన్నది అయ్యన్న ఆలోచనగా చెప్పుకుంటున్నారు. గంటాను ఎంత వీలైతే అంతగా తగ్గించాలని అయ్యన్న భావిస్తూంటే తన శిబిరంలో నుంచి ఒకప్పటి అనుచరులు వీడిపోవడంతో గంటా గ్యాంగ్ లో అలజడి రేగుతోంది.

Similar News