గంటా షిఫ్ట్ అవుతున్నారా...!!

Update: 2018-12-15 13:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ భవితవ్యంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఏ చట్ట సభకు పోటీ చేస్తారన్న దానిపై ఊహాగానాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. తాను ఎట్టి పరిస్తితుల్లోనూ భీమునిపట్నం నుంచే మళ్ళీ పోటీ చేస్తానని గంటా చెబుతున్నా చివరి నిముషం వరకూ ఎవరికీ నమ్మకం లేదంటున్నారు. మంత్రి గంటా సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంద్నై అంటున్నారు.

విశాఖ ఎంపీగానా ...?

సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలు కావడంతో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సరైన అభ్యర్ధి కోసం టీడీపీ వెతుకులాట చేస్తోంది. మూర్తి మనవడు శ్రీ భరత్ పోటీ చేస్తానని ముందుకు వచ్చినా ఆయన బలహీనమైన అభ్యర్ధి అవుతారేమోనని కూడా భావిస్తున్నారు. మూర్తికి విశాఖతో సుదీర్ఘమైన అనుబంధం, వ్యాపార, విద్యాసంబంధమైన పరిచయాలు ఉన్నాయి. అందువల్ల ఆయన బరిలో ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుందని, అదే ఆయన మనవడు పోటీకి దిగితే గెలుపు సందేహమేనన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ అర్బన్ జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న గంటాని విశాఖ ఎంపీ బరిలోకి దింపాలను కూడా చంద్రబాబునాయుడు ఆలొచన చేస్తున్నారని అంటున్నారు.

నెల్లిమర్లకు షిఫ్ట్....

ఇక విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిని గమనంలోకి తీసుకున్న అధినాయకత్వం అక్కడ ఉన్న తొమ్మిది సీట్లను గెలుచుకోవాలంటే గంటాను అక్కడ నుంచి పోటీ చేయించడం ద్వారా ఉత్తేజం తీసుకురావాలని భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న గంటాకు అక్కడ రాజకీయంపై బాగా అవగాహన ఉన్నందున ఆ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారని టాక్. ఈ విధంగా చేయడం వల్ల భీమిలీ సీటును ఆశిస్తున్న అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వవచ్చని, అదే టైంలో గంటా సేవలను మరింతగా వాడుకోవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారట.

Similar News