గంటా మెడకు చుట్టుకునేలా ఉందే.... !!

Update: 2018-12-04 09:30 GMT

విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అనూహ్యంగా విగ్రహాల వివాదంలో చిక్కుకున్నారు. తన పుట్టిన రోజున ఆయన ముగ్గురు ప్రముఖుల విగ్రహాలను విశాఖలో ఆవిష్కరించారు. అదే ఇపుడు పెను వివాదమైన కూర్చుంది. వెండి తెరను ఏలిన అక్కినేని నాగేశ్వరరావు, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావులతో పాటు, ఇటీవల దుర్మరణం పాలు అయిన నందమూరి హరిక్రిష్ణ విగ్రహాలను మంత్రి ప్రారంభించడం ఇపుడు అగ్గి రాజేస్తోంది. దీనికి కారణం ఈ విగ్రహాల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు నిర్వాహకులు తీసుకోకపోవడం ఒకటైతే, నందమూరి హరికృష్ణ విగ్రహం ఏ అర్హత చూసి విశాఖలో ఏర్పాటు చేస్తారని విపక్షాలతో సహా అంతా ప్రశ్నిస్తున్నారు. దాంతో మంత్రి పుట్టిన రోజు వేడుకల ఉత్సాహం కాస్తా ఒక్కసారిగా నీరుకారిపోయింది.

ఓ ఎమ్మెల్యే అత్యుత్సాహం...

నిజానికి అక్కినేని, దాసరి విగ్రహాలు ఏర్పాటు విశాఖ నగరంలో ఏర్పాటు చేయాలని చాలకాలంగా డిమాండ్ ఉంది. కోరిన ప్రదేశంలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించకపోవడం కారణంగా అది ఆగిపోతోంది. విశాఖ బీచ్ లో ఇప్పటికే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ కారణంగానే కొత్త విగ్రహాల ఏర్పాటుకు జీవీఎంసీ అనుమంతించడం లేదు. ఈ సంగతి తెలిసి కూడా ఒకే రోజున అది మంత్రి హోదాలో గంటా అనధికారికంగా మూడు విగ్రహాలను ఆవిష్కరించడంతో టీడీపీ ఇరకాటంలో పడిపోయింది. పైగా అక్కినేని,దాసరిని పక్కన పెడితే నందమూరి హరికృష్ణ విగ్రహం ఏ విధంగా పెడతారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఆయన అనుబంధం ఏంటి?

హరికృష్ణ అన్న గారి కుమారుడిగా, జూనియర్ తండ్రిగా మాత్రమే అందరికీ పరిచయమని, ఆయన సినిమా, రాజకీయ రంగాల్లో చేసిన సేవలేంటని కూడా నిలదీస్తున్నారు. ఇక విశాఖలో ఆయన విగ్రహం పెట్టడానికి ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు ఏంటి, ఇక్కడ నేలతో ఆయనకు ఉన్న అనుబంధం ఏంటని కూడా నిగ్గదీస్తున్నారు. అయితే దీనికంతటికీ తెరవెనక ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని అంటున్నారు. ఆయన అన్న గారి కుటుంబానికి వీర విధేయ భక్తుడని, ఆయన హరికృష్ణ విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని భావించి ఈ విధంగా పావులు కదిపారని అంటున్నారు. తనకు సన్నిహితులైన జీవీఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రే విగ్రహాలను ఆవిష్కరింపచేశారని చెబుతున్నారు. ఇక హరికృష్ణ విగ్రహం ఒక్కటే పెడితే మరింత దుమారం రేగుతుందని భావించి అక్కినేని, దాసరిని కూడా జతకలిపి మొత్తం మూడింటినీ మంత్రి చేతే తెలివిగా ప్రారభింపచేశారని ప్రచారం సాగుతోంది.

చంద్రబాబుకు ఇరకాటం....

ఇదిలా ఉండగా, అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలంటూ విశాఖ వాసులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు. విశాఖ కీర్తిని పెంచిన వారి విగ్రహాలను ఆ స్థానంలో పెట్టాలని కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడే ఒక ఇరకాటం వచ్చిపడుతోంది. తెలంగాణా ఎన్నికల్లో హరిక్రిష్ణ కుమార్తె సుహాసినికి టికెట్ ఇచ్చి అక్కడ సానుభూతిని సొంతం చేసుకుందామని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో విశాఖలో ఏర్పాటు చేసిన హరిక్రిష్ణ విగ్రహాన్ని తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. మరో వైపు ఈ వ్యవహారం మంత్రి గంటా మెడకు కూడా చుట్టుకుంటోంది. ఏమీ తెలియకుండానే ప్రారంభిస్తారా అంటూ అటు పార్టీలోనూ, ఇటు బయటా విమర్శలు చేస్తున్నారు.

Similar News