అట్నుంచి నరుక్కొస్తున్నారే....!!

Update: 2018-12-19 13:30 GMT

రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నో ఎత్తులు వ్యూహాలు వేయాలి. ఎన్నికల సమయం దగ్గరపడిందంటే అందరితో పని పడినట్లే. ఈ తెలివిడి బాగా ఉన్న నేత ప్రజా నాయకుడు అవుతాడు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ఏర్పాట్లు బాగానే చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయడం కంటే ముందే సర్దుబాటు చేసుకుని అంతా రెడీగా పెట్టుకుంటున్నారు. తాను మళ్ళీ గెలిచి రికార్డ్ స్థాయి మెజారిటీని సాధించాలని ఈసారి గంటా గట్టి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు.

కులాల సమీకరణలు....

భీమిలీ నియోజకవర్గంలో కులాల సమీకరణల్లో మంత్రి గారి క్యాంప్ ఇపుడు బిజీగా ఉంది. మొత్తం రెండు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్న ఈ అసెంబ్లీ సీటులో కాపులు, యాదవులు, మత్స్యకారులు, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా తన కులం ఓట్లు పోకుండా చూసుకుంటూనే మిగిలిన కులాలకు గేలం వేస్తున్నారు. ఇందుకు కార్తీక సమారాధనలు, వన భోజనాలు వంటివి అనుకూలంగా వాడేసుకుంటున్నారు. తాజాగా తన నియోజకవర్గంలో పద్మ శాలీ కులాలాతో భారీ ఎత్తున వన సమారాధన జరిపించి తాను ముఖ్య అథిధిగా గంటా హాజరయ్యారు. మొత్తంగా పాతిక వేల పై చిలుకు పద్మ శాలీల సామాజిక వర్గం ఈ సమారాధనకు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా గంటా వారికి అవసరమైన హామీలు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో మద్దతు గట్టిగా తీసుకున్నారు.

మెజారిటీ 70 వేలట....

గతసారి మంత్రి గంటా భీమిలీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేస్తేనే ఏకంగా 38 వేల పై చిలుకు మజేరిటీ వచ్చింది. ఈసారి దాన్ని రెట్టింపు చేయాలన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. అందుకోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగి అన్ని సామాజిక వర్గాలతో మంచి సంబంధాలు నెరపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని తన ప్రాంతానికి తీసుకు వచ్చి మత్స్య కారుల సమస్యలపై హామీ పొందిన గంటా, జ్యూట్ మిల్లు కార్మిక వర్గాల మద్దతు కూడా కూడగడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రత్యర్ధి వైసీపీ నుంచి బలహీనమైన అభ్యర్ధి ఇంచార్జిగా ఉండడం, వేరే ఏ విధంగానూ పోటీ లేకపోవడంతో మంత్రి దూకుడుగా భీమిలీలో రాజకీయం చేస్తున్నారు. మరి ఇవన్ని ఫలిస్తే గంటా వర్గం కోరుకుంటున్నట్లుగా రెట్టింపు మెజారిటీ సాధ్యపడుతుంది.

Similar News