తాళాలు తీయరే ..?

Update: 2018-12-21 05:00 GMT

తెలంగాణ ఎన్నికల్లో మట్టికరిచిన మహాకూటమి లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానమైనది. అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అంతే స్థాయిలో పోరాటంలో ఓటమి పాలు అయ్యింది. దాంతో కాంగ్రెస్ మహామహులు గాంధీ భవన్ కి ముఖం చాటేశారు. ఎన్నికలకు ముందు నిత్యం కళకళలాడిన గాంధీభవన్ లో ఇప్పుడు టిపిసిసి కార్యవర్గంలోని కీలక విభాగాల నేతలు తమ తమ గదులకు తాళాలు వేసి పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశం అయ్యింది. ఫలితాలు వచ్చి పదిరోజులైనా నేతలు తమ ఛాంబర్లలో విధులు నిర్వర్తించేందుకు రాకపోవడంతో ఇప్పటికే నైరాశ్యంలో వున్న పార్టీ క్యాడర్ మరింత డీలా పడిపోయింది. ఎన్నికలకు ముందు టికెట్ల కోసం నేతలు గాంధీభవన్ ముంగిట చేసిన అల్లరి కానీ టికెట్లు దక్కిన నేతలు చేసుకున్న సంబరాలతో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి వచ్చేస్తుంది అన్నంతగా సందడి కొనసాగింది. కానీ ఇప్పుడంతా అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.

ఇప్పుడు వారే లీడర్లు ...

పార్టీకి దక్కిన చేదు అనుభవాన్ని కూడా దిగమింగుకుని నిబద్ధతతో గాంధీభవన్ కు వస్తున్న నేతల్లో పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, దాసోజు శ్రవణ్ లే అంటున్నారు పార్టీ క్యాడర్. వీరంతా గుండె దిటవు చేసుకుని తమ కార్యకలాపాలు మొదలు పెట్టారు. టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ఫలితాలు తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు కానిచ్చి గాయబ్ అయ్యారు. హేమా హేమీలవంటి నేతలు ఘోరపరాజయాలు మూటగట్టుకోవడంతో పార్టీ కార్యాలయానికి ముఖం సైతం కొన్నాళ్ళు చూపించలేని పరిస్థితి నడుస్తుంది.

ఆ... ఎన్నికలకు ఇలా అయితే ...

కొద్దిపాటి సమయంలో ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి తెలంగాణాలో. ఈ పరిస్థితుల్లో ఓటమిని జీర్ణించుకుని నేతలు కదనరంగంలోకి మరోసారి దూకాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. జరిగింది మర్చిపోయి వచ్చే ఎన్నికల్లో అనుసరించాలిసిన వ్యూహం పై కసరత్తు మొదలు పెట్టాలని అంటున్నారు వారు. అదే విధంగా గత ఎన్నికల్లో తప్పులను విశ్లేషణ చేసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని అది ఇప్పటినుంచి వర్క్ అవుట్ చేయాలన్న క్యాడర్ ఆశ మాత్రం ఇప్పట్లో తీరేలా లేదు.

Similar News