ఆ... పేరు చెబితే వణుకుతున్నారే ..?

Update: 2018-12-20 17:30 GMT

గెలిస్తే ఆ గొప్ప మాదే అంటారు. ఓడితే తప్పంతా ఈవీఎం పాపం అంటున్నారు. దేశంలో రాజకీయ పార్టీల నయా ట్రెండ్ ఇదే మరి. బిజెపి గెలిచిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇదే ఆరోపణ చేస్తూ వచ్చేది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసి తెలంగాణ లో చతికిల పడినపుడు ఇదే చెప్పింది. అయితే గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ఈ ముక్క చెప్పడం లేదు. కాంగ్రెస్ గోల అలా పక్కన పెడితే ఇప్పుడు ఇదే జపాన్ని అందుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అంటూనే ఈవిఎంలు తమ కొంప ముంచాయని తేల్చారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు. చిప్ ను మ్యానేజ్ చేయడం సాధ్యమేనని ప్రపంచంలో ఎవ్వరు ఈవిఎం లు వినియోగించడం లేదని బాబు కొత్త వాదన మొదలు పెట్టేశారు.

గతంలో ఆమ్ ఆద్మీ ...

ఇప్పటికే ఈవిఎం లు విధానం తొలగించి పాత విధానంలో బ్యాలెట్ పత్రం ద్వారా ఎన్నికలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈవిఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటే తాము అధికారం లోకి రాలేమన్న అంశాన్ని మాత్రం ఆ పార్టీ కూడా పక్కన పెట్టేసింది. వాస్తవానికి ప్రతిపక్షం అధికారపార్టీ ఈవిఎంలను మ్యానేజ్ చేస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేయడం రివాజు. కానీ దీనికి భిన్నంగా అధికారంలో వున్న పార్టీలు కూడా ఈవిఎం వ్యవస్థపై నమ్మకం లేదనడం విశేషం. ఇప్పుడు ఏపీలో వీలైతే బ్యాలెట్ ద్వారా పంచాయితీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు టిడిపి పేర్కొనడం గమనార్హం.

బ్యాలెట్ సైకిలింగ్ కి ఛాన్స్ ...

బ్యాలెట్ పద్ధతిలో కూడా అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డమ్మీ బ్యాలెట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేసి అసలు బ్యాలెట్ ను బయటకు తెచ్చి ఓట్లు కొనుగోలు చేసిన ఓటర్లకు ముందే తమ పార్టీ గుర్తు పై టిక్ పెట్టించి ఓటు వేశాక వారికి లోపల ఇచ్చే ఖాళీ బ్యాలెట్ తీసుకుని పోలింగ్ బూత్ బయట ఇదే రీతిలో మరొకరితో ఓటు వేయించే విధానం సైకిలింగ్ అంటారు. ఎన్నికల్లో ఈ విధానం అనేక మందిని అధికారానికి దగ్గర చేస్తే అనేకమంది తలరాతలు మార్చింది.

కౌంటింగ్ సమయంలోనూ....

పోల్ మేనేజ్మెంట్ తెలిసినవారు అత్యధికంగా అనుసరించే ఫార్ములా ఇదే అన్నది అందరికి తెలిసిందే. దీనికి తోడు కౌంటింగ్ సమయంలో గంటలకొద్ది సమయం బ్యాలెట్ లెక్కించేందుకు పడుతుంది. పార్లమెంట్ స్థానాల విషయంలో మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఈవిఎం లు వచ్చాక గంటల వ్యవధిలోనే ఫలితాలు తేలిపోతున్నాయి. లెక్కింపు అధికారుల శ్రమా తప్పింది. ఆటలో ఓడిపోయిన పిల్లలు తొండి చేశారన్నట్లు ఇప్పుడు తమ పరాజయానికి అదే కారణం అంటున్న రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించడం ఎప్పటికి విరమిస్తాయో చూడాలి.

Similar News