దినకరన్ చేజేతులా చేసుకున్నదేనా?

Update: 2018-12-15 18:29 GMT

ఉప ఎన్నికలు త్వరగా వస్తాయన్న ప్రచారం జరగుతున్న వేళ దినకరన్ కు చుక్కలు కనపడుతున్నాయి. దినకరన్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ 18 స్థానాలతో పాటు కరుణానిధి, ఏకే బోస్ ల మరణంతో ఏర్పడిన రెండు స్థానాలు మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దినకరన్ కు గట్టి షాక్ తగిలే అవకాశాలున్నాయి. దినకరన్ పార్టీ గుర్తు కోసం పోరాటం చేస్తారని అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేందరూ భావించారు. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు.అన్నాడీఎంకేలో చీలిక తెస్తారనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు.

తప్పుడు నిర్ణయాలతో....

దినకరన్ చెంతకు వచ్చి తప్పు చేశామా? అన్న మీమాంసంలో వారున్నారు. అనర్హత వేటు పడితే దానిపై సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లకుండా దినకరన్ తప్పు చేశారని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి తమ గూటికి రప్పించుకునేందుకు అన్నాడీఎంకే అగ్రనేతలు పళనిస్వామి,పన్నీర్ సెల్వంలు జోరుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తమ వైపు చూస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు మాత్రం మరోసారి అన్నాడీఎంకే వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అలాగని దినకరన్ వెంట ఉండి తమ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవాలని కూడా లేరు.

డీఎంకే గూటికి....

ఈ నేపథ్యంలో వారు డీఎంకే గూటికి చేరతారన్న వ్యాఖ్యలు బలంగా విన్పిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరిపోయారు. ఆయన జయలలితకు నమ్మకమైన వ్యక్తి. అయితే ఇటు దినకరన్ పార్టీ, అటు అన్నాడీఎంకే కూడా నాయకత్వ సమస్య ఎదుర్కొంటుండటంతో డీఎంకేలో చేరితేనే భవిష్యత్ ఉంటుందని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన అనుచరులతో సమావేశమైన సెంథిల్ బాలాజీ డీఎంకే గూటికి చేరి తన నియోజకవర్గమైన కరూర్ నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సెంధిల్ బాలాజీ స్టాలిన్ సమక్షంలో చేరిపోయారు.

స్టాలిన్ నాయకత్వంపైన......

సెంథిల్ బాలాజీ తో పాటు త్వరలో మరో ఆరుగురు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు కూడా డీఎంకే గూటికి చేరతారన్న ఊహాగానాలు తమిళనాడులో జోరుగా విన్పిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంపై నమ్మకం వల్లనే వారు దినకరన్ ను వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దినకరన్ కు గుర్తు లేకపోవడం, ఆర్కే నగర్ ఎన్నికల్లా ఈ ఉప ఎన్నికలు ఉండవని స్పష్టంగా తెలియడంతో వారు డీఎంకే లో చేరాలని భావిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వారిని దినకరన్ సముదాయిస్తున్నా ఫలితం కన్పించడం లేదంటున్నారు. ఇప్పటికే మానసికంగా డీఎంకేలో వారు చేరేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. దినకరన్ పార్టీలోకి అన్నాడీఎంకే నుంచి ఎవరూ రాకపోగా, ఉన్న వారూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

Similar News