ధర్మానది డౌటేనట...!!

Update: 2018-12-09 13:30 GMT

ధర్మాన ప్రసాదరావు... సీనియర్ నేత. పార్టీలోనూ... ప్రజల్లోనూ పట్టున్న నేత. ఈసారి కూడా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో ఉంటే సమస్యలపై ఆయన స్పందించే తీరును అందరూ ప్రశంసిచాల్సిందే. సెటైర్లు... పక్కా ఆధారాలతో ధర్మాన ప్రసంగం సాగుతుంది. అటువంటి సీనియర్ నేత ఈసారి కూడా అసెంబ్లీలోకి అడుగుపెడతారా? లేదా? అన్న సందేహం వైసీపీ శ్రేణుల్లో వెంటాడుతూనే ఉంది. నో...డవుట్... ధర్మనా ఛరిష్మా ఉన్న నేత. సమస్యలపై అవగాహన లీడర్. అయినా ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తీరు చూస్తే మాత్రం అందరికీ ఆశ్చర్యం కల్గించేలా ఉంది.

భారీ ఓట్ల తేడాతో....

గత ఎన్నికలకు ముందే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగన్ గత ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ను కేటాయించారు. ధర్మాన అయితే గెలుపు ఖాయమని జగన్ నమ్మారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధర్మాన ఓడిపోయారు. ఓటమి పాలవ్వడం అటు పక్కన పెడితే, ఆయన ఓటమి పాలయిన మెజారిటీ చూస్తే నివ్వెర పోక తప్పదు. గత ఎన్నికల్లో ధర్మానప్రసాదరావు పై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి24,131 మెజారిటీతో గెలవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే అయింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు. ధర్మాన వ్యక్తిగత ఓటమేనన్నది పరిశీలకుల నుంచి విన్పిస్తున్న మాట.

ఓటమికి గల కారణాలివే...

అయితే వరుస విజయాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ధర్మాన విజయం సాధించారు. వరుస గెలుపులతో పాటు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఓటమికి కారణాలయ్యాయంటున్నారు. కొవ్వాడ అణు విద్యుత్తు ప్లాంట్ కూడా ధర్మాన మెడకు చుట్టుకుందంటున్నారు. అలాగే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పాపం కూడా ధర్మాన పడటం వల్లనే అంత భారీ ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందన్న విమర్శలు అప్పట్లో విన్పించాయి. ధర్మాన ప్రసాదరావు సయితం ఇలాంటి ఓటమిని ఎన్నడూ చూడలేదు.

ధర్మానను ఎక్కడకు పంపుతారు?

కానీ ఈసారి ధర్మానకు కొంత మైలేజీ వచ్చిందంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్న సానుభూతితో పాటు తిత్లీ తుఫాను కారణంగా స్పందిచిన తీరు పట్ల కూడా ప్రజల నుంచి సానుకూలత ఏర్పడిందంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతోంది. ఈపాదయాత్రతో వైసీపీకి మరింత పట్టు పెరిగే అవకాశముందంటున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావును ఈసారి జగన్ అసెంబ్లీకి పోటీ చేయిస్తారా? పార్లమెంటు కు పంపుతారా? అన్నది తేలలేదు. ఈ నియోజకవర్గంలో ధర్మాన మళ్లీ పట్టు బిగిస్తున్నారని మాత్రం చెప్పకతప్పదు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న వైసీపీ కుదురుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఏవిధంగా వచ్చే ఎన్నికల్లో బయటపడుతుందో చూడాలి.

Similar News