జగన్ ఖాతాలో ఈ సీటు ఖాయమట....!!

Update: 2018-12-18 01:30 GMT

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన నియోజకవర్గమిది. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అతి తక్కువ సార్లు గెలిచిన నియోజకవర్గ మిది. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది. ఉప ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించడం విశేషం. అదే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్న పేట నియోజకవర్గం. ధర్మాన ప్రసాదరావు కుటుంబానికి పట్టున్న నియోజకవర్గమిది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నరసన్న పేట నియోజకవర్గంలో....

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో జరుగుతోంది. ఆయన ప్రయాణించిన జమ్ముజంక్షన్, టెక్కలి పాడు క్రాస్ రోడ్స్, రావాడ పేట, చిన్న దుగాం జంక్షన్, నారాయణ వలస, రాణ జంక్షన్, లింగాల వలసలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభించింది. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ధర్మాన సోదరులకు ఈప్రాంతంలో పట్టు ఉన్నప్పటికీ గత ఎన్నికలలో కృష్ణదాస్ ఓటమి పాలయ్యారు.

ధర్మాన కుటుంబానికి.....

నరసన్న పేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే...1955లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీరామారావు పార్టీ స్థాపించిన నాడు కూడా ఇక్కడ టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. 1989లోనూ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి ఇక్కడ బోణీ కొట్టారు. 1999లోనూ ధర్మాన ప్రసాదరావు మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ గెలిచారు. తొలి రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన కృష్ణదాస్ 2012లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

మూడు దఫాలు గెలిచి.....

2014 లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపైన కేవలం 4800 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించిన కృష్ణదాస్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈసారి గెలుపు తమదేనన్న ధీమాలో కృష్ణప్రసాద్ ఉన్నారు. జగన్ నే నమ్ముకుని ఉండటంతో ఆయనకే టిక్కెట్ ఖాయమన్నది దాదాపుగా తేలిపోయంది. ప్రభుత్వ వ్యతిరేకతతో ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్న ధీమాలో ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. దీనికి తోడు జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటంతో తమకు అదనపు బలం చేకూరుతుందని, వైసీపీ ఖాతాలో ఈ సీటును ఖచ్చితంగా వేసుకోవచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనాగా ఉంది.

Similar News