చాడా....ఎందుకీ...తేడా....??

Update: 2018-11-10 00:30 GMT

తెలంగాణలో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో రెండు నెలలుగా చర్చలు జరుగుతున్నా సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఇక ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఫలానా స్థానం ఫలానా పార్టీకి కేటాయించారని జరుగుతున్న ప్రచారానికి ఆయా స్థానాలు ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ఆందోళనలకు దిగుతున్నారు. రోజుకొక నియోజకవర్గ నేతలు గాంధీ భవన్ కు చేరుకుని ధర్నాలు చేస్తున్నారు. అయితే, కూటమిలోని అన్ని పార్టీల్లో సీపీఐ పార్టీది మరీ ఇబ్బందికర వ్యవహారం. ఆ పార్టీ గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. మొత్తం 7 స్థానాల్లో పోటీచేసి కేవలం నల్గొండ జిల్లాలోని మునుగోడు స్థానంలో మాత్రమే విజయం సాధించింది.

సాయుధ పోరాటాన్ని నడిపిన చరిత్ర

తెలంగాణ రాష్ట్రంలో సీపీఐది ఘనమైన చరిత్రే. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన ఘనత ఆ పార్టీది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కూడా మొదటి నుంచి మద్దతు ఇచ్చిన ఆ పార్టీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. తెలంగాణ ప్రాంతంలో మొదట్లో సీపీఐ చాలా బలంగా ఉండేది. సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన నేతలు సీపీఐ పార్టీని ముందుండి నడిపించారు. కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఆ పార్టీ ఉండేది. అయితే, పరిస్థితులు మారిపోయాయి. సీపీఎం చీలిక తర్వాత సీపీఐ కొంత బలహీనపడింది. అయినా నల్గొండ, కరీంనగర్, అదిలాబాద్ వంటి జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం 2004 ఎన్నికల వరకూ కొనసాగింది. 2004లోనూ సీపీఐ తరపున సురవరం సుధాకర్ రెడ్డి నల్గొండ నుంచి పార్లమెంటుకి ఎంపికయ్యారు. అయితే, సీపీఐ, సీపీఎం కలిసి ఉన్నప్పుడు కొంత ఎక్కువగానే ప్రభావం ఉండేది. గత ఎన్నికల నుంచి రెండు పార్టీలు ప్రత్యేకంగా పోటీ చేస్తున్నాయి. సీపీఐ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు.

అల్టిమేటం ఇచ్చినా స్పందన లేదా..?

తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన సీపీఐ పరిస్థితి ఈ ఎన్నికల్లో మరీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మహాకూటమి ఏర్పాటులో కీలకపాత్రే పోషించిన ఆ పార్టీ సీట్ల విషయంలో మాత్రం కూటమిలోనే చిన్న పార్టీగా మిగిలిపోయింది. 12 స్థానాలు కావాలని మొదట డిమాండ్ చేసిన ఆ పార్టీ ఇప్పుడు కనీసం ఐదు స్థానాలైనా ఇవ్వండని బతిమాలుకుంటోంది. అయితే, 3 స్థానాలకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. తవ వద్ద రెండు ప్లాన్లు ఉన్నాయని, అవసరమైతే విడిగా పోటీ చేస్తామని, 30-40 స్థానాల్లో గెలుపోటములు తాము ప్రభావితం చేస్తామని ఓ రకంగా అల్టిమేటం ఇచ్చినా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. స్వయానా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆశిస్తున్న హుస్నాబాద్ టిక్కెట్ కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఇక ఆ పార్టీకి ఎక్కువగా పట్టుంది అని భావిస్తున్న నల్గొండ జిల్లాలో దేవరకొండ, ఆలేరు, మునుగోడు స్థానాలు అడుగుతుండగా ఒక్క స్థానం కూడా ఇవ్వమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, సీపీఐ అడిగే స్థానాల్లో ఆ పార్టీ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటోందని కాంగ్రెస్ అంటోంది. ఎప్పుడో 1962లో గెలిచిన ఆలేరు స్థానాన్ని ఇప్పుడు అడగడమేంటని అంటున్నారు.

ఓటు బ్యాంకు ఉన్నా... ఒంటరిగా గెలవలేని పరిస్థితి

ఈ ఎన్నికల్లో కచ్చితంగా తమకు వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, దేవరకొండ కావాల్సిందే అని సీపీఐ పట్టుబడుతోంది. వీటిల్లో గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీచేసి 21 వేల ఓట్లు సాధించారు. మళ్లీ ఆయనే టిక్కెట్ అడుగుతున్నారు. వైరా నుంచి నారాయణ పోటీ చేసి 27 ఓట్లు, మునుగోడు నుంచి పల్లా వెంకట్ రెడ్డి 21 వేల ఓట్లు సాధించారు. అయితే, ఖమ్మంలో ఆ పార్టీకి సీట్లు ఇవ్వవద్దని, ఇస్తే గెలవదని ఆ జిల్లా కాంగ్రెస్ నేతల వాదన. ఇందుకు వారు గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను సాకుగా చూపిస్తున్నారు. అయితే, సీపీఐకి కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉందనేది మాత్రం ఎవరూ కాదనలేరు. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఆ పార్టీకి జాతీయ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రాంతంలో ఘన చరిత్ర కలిగిన సీపీఐ ఇప్పుడు 3-5 సీట్ల కోసం తన్లాడటం చూసి ఆ పార్టీ అభిమానులైన పాతతరం వారు బాధపడిపోతున్నారు.

Similar News