చెవిరెడ్డికి ఎదురుగాలి వీస్తుందా...??

Update: 2018-12-29 12:30 GMT

చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి పోటీ నువ్వా? నేనా? అన్నట్లు సాగేలా ఉంది. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ గత ఎన్నికల్లోనే పట్టుబిగించింది. తెలుగుదేశం పార్టీ అధినేత సొంత జిల్లా అయిన చిత్తూరులోనే వైసీపీ గత ఎన్నికలలో సత్తా చాటింది. ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవ్వాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట కొంత పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కొంత వెనకబడి ఉన్నారన్న టాక్ ఉంది.

వరుస గెలుపుతో....

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలిసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. చెవిరెడ్డి గత ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడించారు. అయితే వరుసగా నాలుగు దఫాలు గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఆమెపై ఉన్న అసంతృప్తి వల్లనే ఓటమి పాలయ్యామని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. గల్లా అరుణకుమారి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలవడంతో పాటు మంత్రిగా ఉన్న నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న కారణంగానే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నది వాస్తవం.

బలమైన ప్రత్యర్థి కావడంతో....

అయితే ఈసారి గల్లా అరుణకుమారి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నానిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఇంత త్వరగా అభ్యర్థిని ప్రకటించడం వెనక కూడా వ్యూహముందంటున్నారు. చెవిరెడ్డిని దెబ్బతీయాలంటే ఏడాది నుంచే ప్రజల్లో ఉండాలని, అందుకే నానికి అభ్యర్థిత్వాన్ని ముందుగానే ఖరారు చేసి చెవిరెడ్డికి చెక్ పెట్టాలని భావించారు. పులివర్తి నాని కూడా గత కొద్ది నెలలుగా ప్రజల్లోనే ఉంటున్నారు. క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నారు. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదు లోనూ ఆయన దూసుకుపోతున్నారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన నానిని ఎంపిక చేసి చంద్రగిరి బరిలోకి ముందుగానే అభ్యర్థిని వదిలారు చంద్రబాబు.

అప్పుడే ప్రచారంలోకి....

దీంతో చెవిరెడ్డికి చంద్రబాబు వ్యూహం అర్థమయింది. అందుకే ఆయన తన దైనశైలిలో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 4,500 ఓట్లు మాత్రమే చెవిరెడ్డికి మెజారిటీ వచ్చింది. ఈసారి కొత్త అభ్యర్థి కావడం, తాను సిట్టింగ్ ఉండటం చెవిరెడ్డికి వచ్చే ఎన్నిక సవాల్ అని చెప్పక తప్పదు. అందుకోసమే ఆయన సొంత నిధులతో కొన్ని పనులు నియోజకవర్గంలో చేపడుతున్నారు. ప్రభుత్వం తనకు నిధులు కేటాయించడం లేదని, తన సొంత నిధులతోనే కొన్ని పనులు పూర్తి చేయిస్తున్నాననిచెప్పుకొస్తున్నారు. అంతేకాకుండావచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తనను గెలిపిస్తే చంద్రగిరిని ఇంద్రగిరిని చేస్తానని ఆయన ప్రజల ముందుకు వెళుతున్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. ఇప్పటి నుంచే రెండు పార్టీల అభ్యర్థుల ఓట్లు అడుగుతూ ముందుకెళుతున్నారు. ఇలా ప్రచారం మొదలయిన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఇదేనని చెప్పొచ్చు.

Similar News