బాబుకు చిక్కు తెచ్చిపెట్టిందే ...?

Update: 2018-12-09 08:00 GMT

ఎన్నికల ముందు అన్ని పార్టీలు కులాలను ప్రసన్నం చేసుకునేందుకు చేయని ప్రయత్నం ఉండదు. ఇందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ఉపయోగిస్తాయి రాజకీయ పార్టీలు. ఇదే రీతిలో తెలంగాణాలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేయాలిసిన రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసేసుకుంది. ముస్లిం రిజర్వేషన్ల నుంచి బిసిలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు అనేక వివాదాస్పద ప్రకటనలు చేసి రాజకీయ ఎత్తుగడలకు తెరతీసింది. దీన్ని ప్రశ్నిస్తూ కొందరు న్యాయస్థానాల గుమ్మం తొక్కడంతో సుప్రీం ఈ అడ్డగోలు వ్యవహారాలకు చెక్ పెట్టింది. అదే ఇప్పుడు ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలకు చెక్ పెట్టేలా చేస్తుంది.

కాపు రిజర్వేషన్ల అంశం అటకెక్కినట్లే ..... ?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎస్సి ఎస్టీ బిసిలకు సుప్రీం చెప్పినట్లు 50 శాతం వుంది. కొత్తగా కులాల వారీగా లేదా మతాల వారీగా అధికార పార్టీలు రిజర్వేషన్లు ఇచ్చేస్తామని ఓట్ల కోసం ప్రకటించినా ప్రత్యర్ధులు సుప్రీం తీర్పు మాటేమిటి అని ప్రశ్నిస్తారు. తమిళనాడు తరహాలో 67 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు రాజకీయ పార్టీలు తెరమీదకు తెస్తున్న అంశం. కానీ ఆవిధంగా జరిగే పరిస్థితి లేదన్నది తేటతెల్లం. కేంద్ర సర్కార్ ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు పెట్టి తేనెతుట్టె కదిలించే అవకాశం లేదు. దాంతోబాటు మోడీ వంటివారు 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చి చెప్పేస్తున్నారు.

సుప్రీం చెప్పడంతో.....

ఇప్పుడు ఏపీలో కాపులకు రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకం. దీనిపై అధికార టిడిపి తన ఎన్నికల మ్యానిఫెస్టో లో గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమల్లో చతికిల పడింది. ఇదే అంశంపై జనసేన సైతం హామీ ఇచ్చేస్తుంది. ఇదెలా సాధ్యమో క్లారిటీ మాత్రం ఆ రెండు పార్టీలు స్పష్టం చేయడంలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశం కీలకం కానుంది. మరోసారి ఆ సామాజిక వర్గం ఓట్లకు గాలం వేద్దామని భావించినా సుప్రీం తెలంగాణ సర్కార్ విషయంలో సుప్రీం చెప్పిందే వర్తిస్తుంది. మరి ఏపీలో దీనినుంచి ప్రజలను ప్రధాన పార్టీలు ఎలా దృష్టి మరలుస్తాయో వేచి చూడాలి

Similar News