నేను రెడీ... మీరు రెడీనా....?

Update: 2018-12-17 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు ఏప్రిల్,మే నెలలో జరిగే అవకాశాలున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే ఏప్రీల్, మే నెలలో పోలింగ్ తేదీ ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి విజయాన్ని రిపీట్ చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ప్రభుత్వ సంక్షేమాలతో పాటు పోలింగ్ కూడా తనకు అనుకూలంగా ఉండేలా చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈసారి అధికారంలోకి రాకుంటే పార్టీకి భవిష్యత్ ఉండదని గుర్తించిన చంద్రబాబు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు.

సభ్యత్వాలు, గ్రామదర్శినితో.....

ఇప్పటికే గ్రామాదర్శిని ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నికూడా ముమ్మరం చేశారు. గ్రామస్థాయిలో సభ్యత్వాలను ముమ్మరం చేసి వారి చేత పసుపు జెండాను పట్టించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. దాదాపు ఇప్పటికే చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో వారానికి నాలుగురోజులు విధిగా పర్యటించాలని షరతు విధించారు. సభలు, సమావేశాల పేరుతో జనం చెంతనే ఉంటే తమను మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. దీనికి తోడు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు కూడా వచ్చే ఎన్నికల్లో ఉపకరిస్తాయని భావిస్తున్నారు.

మరోసారి సెంటిమెంట్ తో.....

ఈ ఐదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుపడటం, ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి జగన్ పార్టీయే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ విసిరిన సవాల్ ను కూడా తనకు సెంటిమెంట్ గా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. కేసీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనను ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తనకే ఉందన్న విషయాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేశారు.

విభేదాలను పరిష్కరించే దిశగా....

మరోవైపు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను సయితం మెల్లమెల్లగా పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వైరుధ్యం లేకుండా ఉండేదుకు ముఖాముఖి మరోసారి కూర్చోబెట్టి చర్చించాలని నిర్ణయించారు. విభేదాలుపక్కన పెట్టకుంటే పార్టీ నుంచి బయటకు పంపుతానని సీరియన్ వార్నింగ్ ఇవ్వనున్నారు. ఈసారి గ్రూపు విభేదాల విషయంలో కొంత కటువుగానే ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టిక్కెట్ల పంపిణీ కూడా సర్వే ప్రకారమే జరగుతుందని, ఎలాంటి సిఫార్సులు, సిట్టింగ్ లన్న ప్రాతిపదిక ఉండబోదన్న సంకేతాలను పార్టీ నేతలకు పంపారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా నేతల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చంద్రబాబు వారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా వార్నింగ్ లు ఇస్తున్నారు. మొత్తం మీద నాలుగైదు నెలల్లో జరగబోయే సమరానికి చంద్రబాబు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారనే చెప్పాలి.

Similar News