పంచుకో....దంచుకో....!!

Update: 2018-12-15 00:30 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రకటనలో హోరెత్తనున్నాయి. అది కూడా అలా ఇలా కాదు..... వందల కోట్ల రుపాయల్ని ప్రచారానికి ఖర్చు పెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. బడ్జెట్ కేటాయింపులు సరిపోక అదనపు నిధుల అమోదం కోసం దస్త్రాలు ఆర్ధిక శాఖకు చేరుతున్నాయి. ఐ అండ్‌ పిర్‌ డిపార్ట్‌మెంట్ తాజాగా మల్టీ మీడియా పబ్లిసిటీ కోసం 200కోట్ల రుపాయలను కేటాయించాలంటూ ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు పంపింది.

వందల కోట్ల రూపాయలను....

ఇప్పటికే ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల కోసం వందల కోట్ల రుపాయల్ని కుమ్మరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా., డిజిటల్ పబ్లిసిటీలను పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రింటి్‌., ఎలక్ట్రానిక్ మీడియాల కంటే సోషల్ మీడియా పబ్లిసిటీ సమర్ధవంతంగా ఉందనే భావనలో ఉన్న పెద్దలు ఏకంగా 200కోట్లను మల్టీ మీడియా పబ్లిసిటీకి వెచ్చించాలని నిర్ణయించడంపై అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.

అంతర్జాతీయసంస్థకు.....

గత ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి పబ్లిసిటీ ఇచ్చే బాధ్యతలని అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. అమెరికాకు చెందిన గ్రూప్‌ ఎం అనే సంస్థ సచివాలయం కేంద్రంగా పబ్లిసిటీ విధులు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు అనుకూల కథనాలు రాయించడం., ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం., ప్రకటనలు రూపొందించడం వంటి కార్యక్రమాలను సీఎంఓ కేంద్రంగానే సాగుతున్నాయి. భారీ మొత్తంలో ఫీజుగా చెల్లించి మరీ ఈ కాంట్రాక్టు సంస్థకు కార్యాలయాన్ని కూడా సచివాలయంలోనే ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికలు ముగియడం., టీడీపీకి వ్యతిరేక ఫలితాలు రావడానికి సోషల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోవడమే కారణమని సీఎంకు నూరిపోశారు. దీంతో అదనపు బడ్జెట్‌ కేటాయింపుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే హోర్డింగ్‌లు., వాల్‌ పోస్టర్లతో ప్రచారం దాంచేస్తున్న సర్కారు., మల్టీ మీడియా పేరుతో మరో 200కోట్లకు టెండర్ పెట్టింది.

కొత్త బాస్ రాకతో....

ఇటీవలి కాలం వరకు ఐ అండ్ పీఆర్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్., కార్యదర్శి బాధ్యతలు ఒకరే నిర్వహించే వారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ ఈ శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి కమిషనర్‌ వర్సెస్ సెక్రటరీగా పోటీ తయారైంది. కమిషనర్ ఛాంబర్‌లోనే సెక్రటరీ బైఠాయిస్తుండటంతో ఎక్కడ కూర్చోవాలో తెలీక కమిషనర్ విజయవాడ క్యాంప్ ఆఫీసుకే పరిమితమవుతున్నారు. కమిషనరేట్‌లో ఉన్న ఛాంబర్‌లోను., సీఎంఓను కమిషనర్ ఛాంబర్‌లో సెక్రటరీ కూర్చుని ఫైళ్లను క్లియర్ చేస్తుండటంతో ఉద్యోగులు బిత్తరపోతున్నారు. ఎన్నికల వేళ పబ్లిసిటీ హడావుడి సహజమే అయినా కొత్త బాస్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికే "అదనపు" ఏర్పాట్లనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Similar News