పట్టు కోసం ఒట్టుతీసి గట్టున పెడతారా?

Update: 2018-12-06 09:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాలపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు.ఒకవైపు పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు, మరోవైపు సొంత పార్టీలో అసంతృప్తి వీటిని తొలగించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటించి పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటలా ఉండేవి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. వైఎస్ మరణం తర్వాత కూడా ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోకజవర్గాలు వైసీపీకి కంచుకోటల్లా మారాయి.

కంచుకోటను బద్దలు కొట్టాలని....

ఈ కంచుకోటలను బద్దలు కొట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం. చంద్రబాబు నాయుడుకి ప్రకాశం జిల్లా రాజకీయాలు అంతుచిక్కడం లేదు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో తక్కువ స్థానాలు వచ్చినా నేతల మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు. అందుకే చంద్రబాబు నేరుగా పార్టీకి మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం స్థానాలపైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ మూడు నియోజకవర్గాలు వైసీపీకి పట్టున్న ప్రాంతాలు కావడంతో వాటిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న వ్యూహాలను చంద్రబాబు రచిస్తున్నారు.

మళ్లీ టిక్కెట్లు ఇస్తామని.....

ఈ మూడు స్థానాల్లో రెండింటిలో గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన ముత్తుమల అశోక్ రెడ్డి, డేవిడ్ రాజులు టీడీపీలో చేరిపోయారు. వారిద్దరూ పార్టీలో చేరే సమయంలో తిరిగి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని చెప్పి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరిగి వీరికే టిక్కెట్ ఇస్తే గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గెలవడం టీడీపీకి కష్టమే. వీరికి మాట ఇచ్చి తప్పడమా? లేక వారిపై ఉన్న వ్యతిరేకతను తొలగించడమా? అనేది చంద్రబాబు చేతిలోనే ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో ఈనేతలు చేరడంతో అక్కడ టీడీపీ క్యాడర్ వారికి మద్దతివ్వడం లేదు. సహకరించడం లేదు కూడా. కొన్నిసార్లు వారికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు కూడా. అసలే పట్టులేక సతమతమవుతున్న టీడీపీకి ఇది మరింత నష్టం చేకూర్చి పెట్టేలా తయారైంది.

స్వయంగా రంగంలోకి దిగి.....

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజులు ఇద్దరికీ పార్టీలో చేరే సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని నారా లోకేష్ వారికి స్పష్టమైన హామీ ఇచ్చారని చెబుతున్నారు. వీరిపై ప్రజల్లనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. అశోక్ రెడ్డి అయితే గ్రామాల్లో కూడా తిరగలేని పరిస్థితి నెలకొని ఉంది. డేవిడ్ రాజు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ పరిస్థితలను చక్కదిద్దడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. వైసీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో నెట్టుకురావడం అంత సులువు కాదన్న సంగతి చంద్రబాబుకూ తెలియంది కాదు. అయినా పార్టీలో నెలకొన్న విభేదాలను తొలగించాలని ఈ నెలలో చంద్రబాబు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను సమీక్షించేందుకు ఆయన రానున్నట్లు చెబుతున్నారు.చంద్రబాబు రాకతోనైనా ఇక్కడ టీడీపీ గాడిన పడుతుందో? లేదో? చూడాలి.

Similar News