బాబుతో బలమా? బలహీనతా?

Update: 2018-12-05 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహా బలం అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకరకంగా ఇది నిజమే. అయితే అది గత ఎన్నికల వరకేనా? ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తుతో కాంగ్రెస్ కు బలం కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందా? ఇదీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఐదు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో సీమాంధ్రులు మహా ఉంటే యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది వరకూ ఉంటారు. మిగిలిన వారంతా తెలంగాణ స్థానికులే. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై సానుభూతి ఉందన్న విషయం వాస్తవం. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేకపోయామన్న భావన తెలంగాణ ప్రజల మనస్సుల్లో ఎక్కడో ఒక మూల ఉంది. దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాల్సి ఉంటుంది.

టీడీపీ లేకుండా....

కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐ వంటి పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లుంటే ఖచ్చితంగా ఈ కూటమికి విజయం లభించేదన్నది విశ్లేషకుల భావన. ఆంధ్ర పార్టీగా ముద్రపడిన తెలుగుదేశాన్ని కలుపుకోవడం హస్తం పార్టీచేసిన అది పెద్ద తప్పుగా కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు పొరుగు రాష్ట్రాల్లో పెద్దగా పట్టు ఉండదు. రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రాలను చూస్తే ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆర్జేడీ బీహార్ లో బలంగా ఉన్నా జార్ఘండ్ లో బలహీనంగా ఉంది. బీఎస్సీ, సమాజ్ వాదీ పార్టీలు ఉత్తరప్రదేశ్ లో బలంగా ఉన్నా, విడిపోయిన ఉత్తరాఖండ్ లో వీక్ అయిపోయాయి.ఇలా చూసుకుంటూ వెళితే విభజన తర్వాత ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో మనుగడ సాగించినా మరో రాష్ట్రంలో మరుగున పడిపోతాయన్నది చరిత్ర తెలిపిన సత్యం.

కేసీఆర్ పై కాలుదువ్వుతుండటంతో....

అయితే తెలంగాణలోనూ నిలదొక్కుకోవడానికి చంద్రబాబు పొత్తు మార్గం ఎంచుకున్నారు. ఇక్కడ పొత్తు కాంగ్రెస్ అవసరం కన్నా చంద్రబాబు అవసరమే ఎక్కువన్నది ఎవరికీ తెలియంది కాదు. అయితే చంద్రబాబు తొలుత ప్రచారానికి దూరంగా ఉంటారని భావించారు. రాష్ట్ర టీడీపీ నేతలకే ప్రచార బాధ్యతలను అప్పగిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి వచ్చి కేసీఆర్ పై కాలుదువ్వుతున్నారు. కేసీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. ప్రచారాన్ని హీటెక్కించారు. కేసీఆర్ ను ఓడించాలని ప్రతి సభలోనూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు.

ఆంధ్రపాలన వస్తుందని.....

చంద్రబాబు రాకతో ప్రజాకూటమి కొంత వెనకబడిపోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చంద్రబాబును బూచిగాచూపించి టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటోంది. చంద్రబాబుకు అప్పగిస్తే మళ్లీ ఆంధ్ర పెత్తనం వస్తుందని పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారానికి దిగుతుంది. అమరావతిలో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రచారాన్ని జోరుగా చేస్తుంది. ప్రమాణస్వీకారం సమయంలో మళ్లీ తెలుగుజాతిని ఏకంచేస్తాననిచంద్రబాబుచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. నీటి పారుదల ప్రాజెక్టులకు అడ్డుపడిన చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రజాఫ్రంట్ కు అధికారం అప్పగిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న టీఆర్ఎస్ ప్రచారం చివరి నిమిషంలో కాంగ్రెస్ కు దెబ్బ పడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే చంద్రబాబు రాకతో తమ బలం పెరిగిందని, గెలుపు ఖాయమన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News