అది చూపించి ... అయిందనిపిస్తున్నారా ...?

Update: 2018-12-25 03:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ఎన్నికలకు ముడి గట్టిగా పడి వుంది. తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాజెక్ట్ ప్రగతి ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రం. అది గ్రహించే కేంద్రం నిర్మించాలిసిన ఈ బృహత్తర ప్రాజెక్ట్ ను నెత్తిన పెట్టుకుని పని మొదలు పెట్టింది ఎపి సర్కార్. అటు అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితం కావడంతో ఎపి ప్రజలకు టిడిపి ప్రభుత్వం ఎదో ఒక పెద్ద అభివృద్ధి చూపించక తప్పని పరిస్థితి ఎదురైంది. దానికి కళ్లెదుటే పోలవరం ప్రాజెక్ట్ మాత్రం రెడీ గా వుంది. దాంతో ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ తమఖాతాలో వేసుకునేందుకు తమ శక్తి యుక్తులన్నీ వినియోగించి విస్తృత ప్రచారాన్ని సొంత మీడియా లో చాటేస్తుంది తెలుగుదేశం.

రెండేళ్ళుగా అరచేతిలో పోలవరం ...

2014 లో టిడిపి సర్కార్ వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికి పూర్తి అయ్యి ఉండేది. కానీ 2017 వరకు చురుగ్గా పనులు చేపట్టలేదు టిడిపి సర్కార్. మధ్యలో ప్రధాన కాంట్రాక్టర్ ను తొలగించడం వేరేవారికి పనులు అప్పగించడం తరచూ కేంద్రంతో చర్చలతో పుణ్యకాలం కాస్తా పూర్తి అయిపోయింది. దాంతో ఎన్నికల ఏడాది హడావిడి మరింత ఎక్కువ చేయాలిసి వస్తుంది చంద్రబాబుకు. ఇప్పటికే 3500 కోట్ల రూపాయలు కేంద్రం బకాయి పెట్టిందని అంటున్న ఎపి సర్కార్ పనులు మాత్రం వేగవంతం చేసింది. ఈ మే నెలకు నీరు గ్రావిటీ పై ఇచ్చేస్తామని ఆర్భాటంగా ప్రకటించేసింది. అయితే ఇలాంటి ప్రకటనలు ఇప్పటికే చాలా చేసేసింది అధికారపార్టీ.

డ్యామ్ లేకుండా ...?

వాస్తవానికి మిగిలిన ప్రాజెక్ట్ లకు పోలవరానికి చాలా తేడా వుంది. ఇక్కడ డ్యామ్ వేరే ప్రాంతంలో నిర్మించి ఆ అడ్డుకట్టనుంచి వచ్చే నీటిని మరోచోట నిర్మించే స్పిల్ వే ద్వారా విడుదల చేస్తారు. ప్రాజెక్ట్ అంటే స్పిల్ వే గానే భావించే ప్రజలు ఆ లెక్కల్లోనే వున్నారు. కానీ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాకుండా గ్రావిటీ పై స్పిల్ వే నుంచి నీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదు. అందరు చూసేది స్పిల్ వే ప్రాంతాన్నే కాబట్టి ఆ నిర్మాణ పనులు మాత్రం వేగవంతంగా సాగిస్తున్నారు కాంట్రాక్టర్లు. సర్కార్ కూడా ఈ స్పిల్ వే చూపించి అదిగో ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిందని చెబుతూ రావడం రాబోయే ఎన్నికల కోసమే అన్నది స్పష్టం.

ఎత్తు పెరిగే కొద్దీ......

దీనికి తోడు డ్యామ్ ఎత్తు పెరిగే కొద్ది పోలవరం ముంపు ప్రాంతాలన్నీ నీట మునగడం ఆరంభిస్తాయి. అదే జరిగితే బాధితులకు నష్టపరిహారం అప్పటికే చెల్లించాలిసి వుంది. అందువల్లే స్పిల్ వే నే అసలు ప్రాజెక్ట్ అనే ప్రచారాన్ని తమ ప్రసార మాధ్యమాల్లో హోరెత్తించి రాజకీయ ప్రయోజనాలకే టిడిపి పెద్ద పీట వేయడం విశేషం.అందుకే పోలవరం స్పిల్ వే గేటు బిగింపు కార్యక్రమాన్ని కూడా సర్కార్ మెగా ఈవెంట్ గా మార్చేసిందన్నది ఇంజనీరింగ్ నిపుణులు సైతం చెబుతున్నమాట. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేస్తే పోలవరం పూర్తి అవుతుందనే ప్రచారం సాగించి ఓట్లు దండుకోవడమే పరమావధిగా టిడిపి రాజకీయాలు నడవడం ఆందోళనకర పరిణామమే.

Similar News