బేస్ లేకుండా బాబు చేయడం లేదా...?

Update: 2018-12-26 00:30 GMT

ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్ని రకాల ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేలా ఉంది. దీంతో చంద్రబాబు సిట్టింగ్ లను పక్కనపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు పది మంది ఎమ్మెల్యేలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్నది బాబు వ్యూహంగా కన్పిస్తోంది. దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది వరకూ సిట్టింగ్ చీటీలు చిరిగిపోతాయన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. ఇందుకు చంద్రబాబు దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందని కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తుండటం విశేషం.దీంతో సిట్టింగ్ లలో టెన్షన్ ప్రారంభమయింది.

పదమూడు జిల్లాల్లోనూ....

ఒకటి రెండు కాడు దాదాపు పదమూడు జిల్లాల్లో సిట్టింగ్ లది ఇదే పరిస్థితి. కొందరు పార్టీ మారతారన్న వారికి తన సర్వేలో మంచి మార్కులు రావడంతో వారిని బుజ్జగించే చర్యలు కూడా చంద్రబాబు చేపట్టారని సమాచారం. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. వారితో ఇప్పటికే టీడీపీ అధిష్టానం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాలా? లేక వారినే బుజ్జగించి కొనసాగించేలా చూడాలా? అన్నదానిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. వీరుకాకుండా మరో ఇద్దరు సిట్టింగ్ లకు టిక్కెట్ రాదని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

మంత్రికి....మాజీ మంత్రులకు....

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు నుంచి ముగ్గురు సిట్టింగ్ లకు సీట్లు రావంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేకు, అలాగే వయసు మీదపడిన కారణంగా మరో ఎమ్మెల్యేకు టిక్కెట్ దక్కదని చెబుతున్నారు. ఇక విశాఖ జిల్లాలో కనీసం ముగ్గురికి టిక్కెట్లు గల్లంతవుతాయంన్న టాక్ బలంగా విన్పిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో కొత్త అభ్యర్థులకు చోటు దక్కే అవకాశముంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మంత్రిగా ఉన్న ఓ నేతకు టిక్కెట్ కష్టమేనంటున్నారు. మరో మాజీ మంత్రికి కూడా సీటు కోల్పోయే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో స్థానిక రాజకీయాల కారణంగానే వారిద్దరికి టిక్కెట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త వారికే ఛాన్స్....

కృష్ణా జిల్లాలో కూడా ఒకరిద్దరికి సీట్లు దొరికే ఛాన్సు లేదు. ఈ జిల్లాలో మంత్రి పనితీరుపట్ల కూడా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరొక ఎమ్మెల్యే పనితీరు కూడా బాగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేత కోసం చూస్తున్నారు. ఇదే జిల్లాలో మరో నియోజకవర్గ ఇన్ ఛార్జికి కూడా టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లలో సయితం మార్పులు, చేర్పులు ఉంటాయంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుండటంతో తొలిజాబితాలో ఆయన పేరు ఉండకపోవచ్చు. ఇక ప్రత్తిపాడు నుంచి రావెల కిశోర్ బాబు జనసేనలో చేరడంతో అక్కడ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ప్రకాశం జిల్లాలోనూ ఇద్దరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు టిక్కెట్ కష్టమేనని బాబు పరోక్షంగా వారికి చెప్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

సీమలోనూ.....

నెల్లూరు జిల్లాలో గతఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య తక్కువే అయినా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా బాగాలేదని తెలుస్తోంది. సిట్టింగ్ లలో ఇద్దరికి అవకాశాలు తక్కుగా కన్పిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మాత్రం భారీ మార్పులుంటాయని గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ లలో కనీసం నలుగురిని మార్చేస్తారన్న టాక్ జిల్లాలోనే విన్పిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లాలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలకు సీటు రాదంటున్నారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలే బాబు సర్వేలో అట్టడుగున ఉండటం విశేషం. చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని మార్పులు తప్పవని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తం ముగ్గురికి చిత్తూరులో సీట్లు దక్కవని బహిరంగంగా టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ లకు సీట్లు దక్కే అవకాశం లేనట్లే కన్పిస్తుంది. దీంతో టిక్కెట్లు రాని వారు రెబల్స్ గా మారకుండా కూడా వారికి కౌన్సెలింగ్ చేసే యత్నంలో బాబు ఉన్నట్లు కన్పిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News