ఆ విధంగా ముందుకు ...!! ?

Update: 2018-12-16 08:00 GMT

తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తెలుగుదేశం ఇంకా కోలుకోలేకపోతుంది. పరాజయం చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు వున్న అన్ని అవకాశాలను తెలుగుదేశం అధినేత వినియోగించడం మొదలు పెట్టారు. మంత్రులు ఎమ్యెల్యేలతో ముందు భేటీ అయ్యారు. పార్టీ శ్రేణుల ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. అక్కడి ఫలితాలు ఏపీ పై పడవని భరోసా ఇచ్చారు. కెసిఆర్, అసద్ లు పెట్టే కూటమి బిజెపికి లబ్ది చేకూర్చేందుకే అని తేల్చారు చంద్రబాబు.

కాంగ్రెస్ తో మరింత ఇదిగా ...

జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలంటే కాంగ్రెస్ తో నడవక తప్పదని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. అదే విషయాన్ని పార్టీ వర్గాలకు తెలియచేశారు బాబు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బాబుకు ఆ పార్టీ గెలిచిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్లాలా లేదా అన్న అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ల నుంచి తీసుకునేందుకు బాబు చిన్నపాటి చర్చ పెట్టారు. గతంలో కూడా ఇదే రీతిలో బాబు పార్టీ సీనియర్లతో కీలక అంశాలపై ఇలాగే చర్చలు జరిపి తాను తీసుకునే నిర్ణయమే అమలు చేశారు.

జాతీయ స్థాయిలో ...

జాతీయ రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని పార్టీ సీనియర్లు బాబుకు సూచించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళిరావాలని కోరారు. ఏపీలో పార్టీ పరిస్థితి ని సమీక్షించారు చంద్రబాబు. బిజెపి సహా అన్ని రాజకీయపక్షాలు టిడిపి పై చేస్తున్న కుట్రలను బలంగా ప్రజల్లోకి తీసుకురావాలని బాబు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇలా ఏపీ సీఎం రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలు అనుసరించాలిసిన వ్యూహాలకు పదును పెట్టడం విశేషం.

Similar News