బాబుకు బ్రహ్మాస్త్రం దొరికిందా...??

Update: 2018-12-24 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తెలంగాణాలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో అధికార పక్షానికి అనుకూల ఫలితాలు వస్తాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగే అభివృద్ధి మంత్రం జరిపిస్తుంటూ పోతుంటే కుదరదని చంద్రబాబు తేల్చేశారు. వ్యక్తిగతంగా ప్రజలు లబ్దిపొందితేనే తమకు జై కొడతారని ఆయన విశ్వసిస్తున్నారు. ఎంత ఎక్కువ మంది లబ్దిపొందితే అంత సంఖ్యలో ఓట్లు వచ్చి పడతాయని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు.

కేసీఆర్ రూటులోనే...

తెలంగాణలో ఎవరెన్ని చెప్పుకున్నా ప్రతి కుటుంబం ఏదో రకంగా ప్రభుత్వం నుంచి లబ్ది పొందింది. రైతు బంధు, కల్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి వాటితో కుటుంబంలో ఒకరైనా ప్రభుత్వ లబ్దిదారుడు ఉండేలా కేసీఆర్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. అందుకే ఎవరూ ఊహించని రీతిలో... గులాబీ పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడ్డాయి. మొత్తం రెండు కోట్ల మంది పోలింగ్ లో పాల్గొంటే 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్ కు పడ్డాయంటే అది సంక్షేమ పథకాల పుణ్యమేనని, కేసీఆర్ కు అధికారం రాకుంటే ఈ పథకాలు నిలిచిపోతాయని భావించి జనం కేసీఆర్ కు జై కొట్టారన్నది చంద్రబాబు విశ్లేషణగా కన్పిస్తోంది.

వ్యక్తిగత లబ్దిపొందితేనే...

ఏపీలో కూడా నెలకు యాభైలక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరంతా తెలుగుదేశం పార్టీ పట్ల కొంత సానుకూలతతో ఉన్నారని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు.ఎన్నికల లోపు పింఛన్ మొత్తాన్ని పెంచాలన్న యోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలను తామే ముందుగా అమలు చేసి ఎన్నికలకు వెళితే గట్టెక్కుతామని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఏపీలో ప్రధాన ఓటు బ్యాంకు అయిన రైతాంగాన్ని కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు పథకానికి కాస్త అటు ఇటుగా ఏపీలోనూ వచ్చే నెలలో ప్రవేశపెట్టాలన్న యోచనలో చంద్రబాబుఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో మరిన్ని పథకాలు.....

ఇటీవల జరిగిన టీడీపీ నేతల సమావేశంలో రైతు బంధు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఒకవైపు సంక్షేమ పథకాలను పెంచుకుంటూ, మరోవైపు మోదీ చేసి అన్యాయాన్ని వివరిస్తూ, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు తెలియజెబుతూ ఎన్నికలకు వెళ్లాలనినిర్ణయించారు. ఇందుకు కేసీఆర్ ను కూడాచంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వాడుకోనున్నారు. కేవలం అభివృద్ధి పథకాలను నమ్ముకుంటూ వెళితే విజయం సాధించలేమని భావిస్తున్న చంద్రబాబు త్వరలోనే ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. అవి సక్రమంగా గ్రౌండ్ అయితే తమకు గెలుపు గ్యారంటీ అని తెలుగు దేశం అధినేత చెబుతున్నారు. అందుకే ఆయన తన నివాసంలో గత రెండు రోజులుగా ఆర్థిక నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News