బాబును ఓడించాలంటే స్కీమ్ అదేనా....?

Update: 2018-12-20 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసిన స్కీమ్ నే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారా? చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా టీఆర్ఎస్, ఎంఐఎం పనిచేస్తాయన్నది స్పష్టమయిపోయింది. అయితే కేసీఆర్ ఏ వ్యూహం అమలు చేస్తారన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు అర్థం కాని ప్రశ్న. ఎంఐఎం మాత్రం నేరుగా ప్రచారం చేస్తామని చెప్పింది. ఇప్పటికే గుంటూరు,కర్నూలు జిల్లాల్లో ఎంఐఎం పార్టీ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తారు. ఆయన జగన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. జగన్ కు ఓటు వేయాలని ఆయన నేరుగా ప్రజలకు చెబుతారు.

టీఆర్ఎస్ లో స్పష్టత లేకున్నా....

కాని టీఆర్ఎస్ విషయానికొస్తే ఆ స్పష్టత లేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తనను అక్కడకు రమ్మని లక్షల సంఖ్యలో ఏపీ ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసినా, ఎవరికి మద్దతివ్వనున్నదన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ రావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం కూడా జగన్ కు మద్దతుగానే వీరి వ్యూహం ఉంటుందన్నది మాత్రం దాదాపుగా తేలిపోయింది. అయితే నేరుగా ప్రచారంలోకి దిగుతారా? లేక చంద్రబాబు స్కెచ్ నే అమలు పరుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

పవన్ తో భేటీ ఉంటుందా?

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నేరుగా కేసీఆర్ పైనా, ఆయన పార్టీపైనా విమర్శలకు దిగారు. వివిధ సభలలో, రోడ్ షోలలో చంద్రబాబు తమపై చేసిన విమర్శలను టీఆర్ఎస్ నేతలు గుర్తుకు తెస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరూ సన్నిహితులే. వారిని ఇద్దరినీ ఏకం చేయాలన్న ప్రయత్నాన్ని తొలుత కేసీఆర్ మొదలుపెడతారంటున్నారు. పవన్ కల్యాణ్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ను స్వయంగా కలసి శుభాకాంక్షలు చెప్పనున్నారని తెలిసింది. ఈ మేరకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ను జనసేన నేతలను కోరారని చెబుతున్నారు.

ఇద్దరినీ కలిపితే......

కేసీఆర్, పవన్ కల్యాణ్ భేటీలో ఏపీలో వైసీపీ, జనసేన కలసి పోటీ చేసే అంశంపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. విడివిడిగా పోటీ చేసినా అక్కడ చంద్రబాబు ను ఓడించేందుకు అవసరమైన వ్యూహాన్ని పవన్ కు కేసీఆర్ చెప్పనున్నట్లు సమాచారం. జగన్ ను నేరుగా కలవకపోయినా జగన్ అంటే కేసీఆర్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ తెలంగాణలో పోటీ చేయకపోవడం, చంద్రబాబుపై ఉన్న ఆగ్రహం మొత్తం జగన్ పట్ల కేసీఆర్ కు సానుకూలత పెరిగిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో పటిష్టతగా లేకపోవడం, జగన్ బలంగా ఉండటంతో ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారన్న టాక్ గులాబీ పార్టీలో బలంగా విన్పిస్తుంది. మరి కేసీఆర్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.

Similar News