అపర చాణక్యుడికే అవస్థలా.. !!

Update: 2018-12-19 05:00 GMT

రాజ‌కీయాల్లో అప‌ర చాణిక్యుడిగా వెలుగొందుదామ‌ని అనుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తెలంగాణా రూపంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పెద్ద‌ ఎదురు దెబ్బ త‌గిలింది. ఏపీలో ఎలాగూ అధికారంలోనే ఉన్నాను కాబ‌ట్టి దేశంలోనూ చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు భావించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ పార్టీల అధినేత‌ల‌ను ఒకే తాటిపైకి తెస్తున్నారు. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మోడీ సంగ‌తేంటో తేల్చాల‌ని కాస్త సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నాలు చేశారు. రాజ‌కీయ వైరంతో కొన్ని ద‌శాబ్దాల పాటు విభేదాలు కొన‌సాగిన కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. దీనిని స‌మ‌ర్ధిం చుకున్నారు కూడా! దేశ రాజ‌కీయాల్లో కీల‌క మైన మార్పులు అవ‌స‌రం క‌నుక తాను చేసిన ప్ర‌యోగం స‌ఫ‌లీకృతం అవు తుంద‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే తొలి అడుగుగా ఆయ‌న తెలంగాణా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్తో క‌లిసి పోటీ చేశారు.

తెలంగాణలో విఫలం కావడంతో...

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో క‌లిసి వేదిక‌ల‌ను సైతం పంచుకుని ముందుకు వెళ్లారు. దీంతో టీడీపీ ప్ర‌స్థావ‌న ఏ కంగా దేశ‌వ్యాప్తం అయింది. చంద్ర‌బాబును ఏకంగా దేశ మీడియా కూడా ప్ర‌ధానంగా వెలుగులోకి తెచ్చింది. మోడీపై ఉన్న ద్వేషం.. తెలంగాణాలో పావులు క‌ద‌పాల‌ని, నిల‌దొక్కుకోవాల‌నిచేసిన ప్ర‌య‌త్నంపై విస్తృతంగా చర్చ జ‌రిగింది. అయితే, అనూహ్యంగా బాబు చేసిన చాణ‌క్యం తొలి అడుగులోనే విఫ‌లమైంది. తెలంగాణాలో చంద్ర‌బాబుకు ఎదురు దెబ్బ త‌గిలిం ది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కీల‌క స్థానాల్లో విజ‌యం సాధించి.. కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని అనుకున్న బాబుకు ఫ‌లితాలు రివ‌ర్స్ అయ్యాయి దీంతో ఒక్క‌సారిగా బాబు హ‌వాపై మ‌స‌క చీక‌ట్లు క‌మ్ముకున్నాయ‌ని అనిపిస్తోంది.

మోదీకి చెక్ పెట్టాలనుకుంటే....

చివ‌ర‌కు త‌న‌కు ప‌ట్టుంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకునే హైద‌రాబాద్‌లోనే త‌న సొంత మేన‌కోడ‌లు అయిన నంద‌మూరి ఆడ‌ప‌డుచు సుహాసిని చిత్తుగా ఓడిపోయారు. ఇది ఓ ర‌కంగా టీడీపీకి ఘోర అవ‌మాన‌మే. మ‌రో నాలుగు మాసాల్లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. దీంతో దేశ వ్య‌ప్తంగా ఆల్ట‌ర్‌నేట్ సృష్టించి.. మోడీకి చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. అయితే, ఆయ‌న‌కు అంత అనుకూలంగా ఇప్పుడు ప‌రిస్థితి లేద‌నేది ప్ర‌ధాన విషయం. కేంద్రంలో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న మాట నిజ‌మే. అనేక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఓడిపోయింది.

కాంగ్రెస్ పై విశ్వాసమేదీ?

అయితే, పూర్తిస్థాయిలో అటు కాంగ్రెస్ పై కూడా ప్ర‌జ‌ల్లో విశ్వాసం క‌నిపించ‌డం లేదు. ఈ ఫ‌లితం దేశంలోని మూడు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్పష్ట‌మైంది. దేశ‌వ్యాప్తంగా బీజేపీయేత‌ర పార్టీల‌ను క‌లుపుకుని కాంగ్రెస్ అధ్వ‌ర్యంలో కూట‌మిగా క‌ట్టాల‌నుకున్న ఆయ‌న ఆశ‌ల‌కు ఆదిలోనే తెలంగాణ‌లో పెద్ద గండిప‌డింది. దీంతో మొత్తం చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం ఉంచే ప‌రిస్థితి కూడా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌కు లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూస్తే.. ఒక్క తెలంగాణా ఫ‌లితం రాజ‌కీయంగా చంద్ర‌బాబు చాణిక్యంపైనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రి దీనిని త‌నకు అనువుగా మ‌లుచుకుంటేనే, వ్యూహాల‌కు ప‌దును పెంచుకుంటేనే .. బాబుకు రాజ‌కీయంగా ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏంచేస్తారో చూడాలి.

Similar News