బాబును వణికిస్తున్న ఆ నియోజకవర్గం...??

Update: 2018-12-20 12:30 GMT

నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఎసరువచ్చేలా ఉంది.అందుకే ఆయన ఇక నియోజకవర్గంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లోఉన్న బాలకృష్ణ ఈసినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గంలో ఓటమి పాలు కావడంతో చంద్రబాబు కొంత ఇబ్బంది పడుతున్నారు. కూకట్ పల్లి మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గ ఫలితాలొస్తే తలెత్తుకోలేమని భావించిన చంద్రబాబు బాలకృష్ణను అలెర్ట్ చేసినట్లు తెలిసింది.

సేప్టీ నియోజకవర్గమైనా....

కూకట్ పల్లి నియోజకవర్గం మాదిరిగానే హిందూపురంలో కూడా ముస్లిం, కాపు సామాజిక ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఆ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తప్ప మరెవ్వరూ విజయం సాధించలేదు. ఎన్టీ రామారావు మొదలు, హరికృష్ణ, బాలకృష్ణలను ఈ నియోజకవర్గం ప్రజలు ఆదరించారు. టీడీపీ గుర్తుపై నిలబడిన మరికొందరిని కూడా ఇక్కడి ప్రజలు ఆశీర్వదించారు.

సమీకరణాలు మారుగుతుండటంతో...

అయితే ఇటీవల హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఇటీవల జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీలో చేరి వచ్చిన తర్వాత అబ్దుల్ ఘని నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అబ్దుల్ ఘని ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంటుందని టీడీపీ అధినేత ఆందోళన చెందుతున్నారు. అబ్దుల్ ఘని2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బాలకృష్ణ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మైనారిటీలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆ నియోజకవర్గంలో విన్పిస్తున్నాయి.

ఆయనే అభ్యర్థి అయితే....

ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నుంచి అబ్దుల్ ఘని పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనే అభ్యర్థి అయితే బాలకృష్ణకు చిక్కులు తప్పవు. మరోవైపు గత ఎన్నికల్లో తనకు అండగా నిలబడిన బలిజ (కాపు) ఓటర్లు కూడా ఈసారి దూరమయ్యే అవకాశాలే కన్పిస్తున్నాయి. జనసేన అభ్యర్థి కూడా బరిలో ఉంటారన్న ప్రచారం ఉండటంతో త్రిముఖ పోటీలో మైనారిటీలు అధికంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈ పరిణామాల కారణంగానే చంద్రబాబు బాలకృష్ణను అలెర్ట్ చేసినట్లు సమాచారం. త్వరలో చంద్రబాబు కూడా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబుకు హిందూపురం పేరు వింటేనే కూకట్ పల్లి ఫలితం గుర్తుకు వస్తుంది.

Similar News