బాబుపై త‌గ్గుతున్న భ‌రోసా.. రీజ‌న్ ఏంటి..!

Update: 2018-12-23 09:30 GMT

తాను త‌లుచుకుంటే ఏదైనా సాధిస్తాను. ఢిల్లీ గ‌ల్లీల్లో సైతం తాను చ‌క్రం తిప్పుతాను అని అంటున్న టీడీపీ అధినేత, సీ ఎం చంద్ర‌బాబుపై ఇప్పుడు భ‌రోసా త‌గ్గుతోందా? ఆయ‌న‌ను న‌మ్ముకునే క‌న్నా.. మ‌న‌కు మ‌నం ఎదిగితే.. మంచిద‌నే ఉద్దేశంలో త‌మ్ముళ్లు ఉన్నారా? అంటే.. తాజాగా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. ఔన‌నే స‌మాధా న‌మే వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. చంద్ర‌బాబు.. తెలంగాణా ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న కీల‌కంగా తీసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ అంటే.. మ‌హాకూట‌మి ఆధ్వ‌ర్యంలో టీడీపీ జెండాపై పోటీ చేసిన వారిని గెలిపించుకుని తీరాల‌ని ఆయ‌న భావించారు.

తామే ఇమేజ్ పెంచుకోవాలని.....

అయితే, చంద్ర‌బాబు ఎక్క‌డైతే ప్ర‌చారం చేశారో.. ఏ స్థానాల‌ను ఆయ‌న కీల‌కంగా అనుకున్నారో.. అక్క‌డ మాత్రం టీడీపీకి ఎదురుగాలులు వీచాయి. తెలంగాణ‌లో మొత్తం 13 సీట్ల‌లో పోటీ చేస్తే కేవ‌లం రెండు స్థానాల్లో మాత్రం టీడీపీ (ఇక్క‌డ అభ్య‌ర్థుల ప‌నిత‌నం క‌నిపించింది, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఆంధ్రాకు స‌రిహ‌ద్దు ప్రాంతాలు కావ‌డంతో పాటు అనేక కార‌ణాల నేప‌థ్యం) గెలుపు గుర్రం ఎక్కింది. ముఖ్యంగా శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌ను బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం మాత్రం క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడు ఏపీలోని టీడీపీ నేత‌లు మ‌ద‌న ప‌డుతున్నారు. అంత‌ర్గ‌తంగా నాయ‌కులు బాబుపై భ‌రోసా పెట్టుకోవ‌డం క‌న్నా తామే ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకోవ‌డం మంచిద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

జగన్, పవన్ లు ఒకవైపు...

ఒక‌ప‌క్క‌, తెలంగాణాలో బాబు చ‌తికిల ప‌డిన‌ప్ప‌టికీ.. మొత్తం దేశంలో మ‌ళ్లీ తాను చ‌క్రం తిప్పుతానంటూ.. చేస్తున్న ఆయ‌న వ్యాఖ్య‌లు మాత్రం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. దీంతో ముందు ఏపీలో పార్టీ ప‌రిస్థితిపై దృష్టి పెట్టాల‌నే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. వీలైనంత త్వరగా డ్యామేజీ కంట్రోల్ మొదలు పెట్టక పోతే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం వారిలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాలు అంటూ ఢిల్లీలో కాలయాపన చేస్తూ, అక్కడి రాజకీయ నాయకులతో భేటీ లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, ఇక్కడ వైయస్ జగన్ , పవన్ కళ్యాణ్ లు ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నారు. జగన్ పాదయాత్ర దాదాపు ఏడాది పాటు కొనసాగి ఇక పూర్తి కావస్తోంది. దీంతో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జాతీయ రాజకీయాలు ఎందుకంటూ....

ఇటు పవన్ కళ్యాణ్ కూడా, మీడియాలో పెద్ద కవరేజ్ రాకపోయినప్పటికీ, అగ్ర ఛానెళ్లలో.. డిబేట్ లలో విశ్లేషకులు పవన్ కళ్యాణ్ పార్టీని పరిగణించకుండా విశ్లేషిస్తున్న ప్పటికీ, చాపకింద నీరులాగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. వ్యూహాత్మకంగా తన బలం ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ వెళ్తున్నారు. ఆటు టీఆర్ఎస్ కూడా బాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానిస్తోంది. మ‌రోవైపు ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ సైతం తాను ఏపీలో జ‌గ‌న్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాన‌ని, బాబు అంతు తేలుస్తానంటూ స‌వాళ్లు రువ్వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌రో నాలుగు మాసాల్లో నే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న ఏపీపై చంద్ర‌బాబు దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే, బాబు వ్యూహ ర‌చ‌న మాత్రం ఢిల్లీపైనే ఉండ‌డంతో త‌మ్ముళ్ల‌లో 2019 ఎన్నిక‌లు ఎలా ఎదుర్కోవాలా ? అన్న అంత‌ర్గ‌త చింత అయితే ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది.

Similar News