టీడీపీలో 31 మంది ఇన్‌చార్జ్‌లు అవుట్‌…?

ఏపీలో టీడీపీ ప్రతిప‌క్షంలో వ‌చ్చి 20 నెల‌లు అవుతోంది. ఇప్పటికే ఒక వంతు పాల‌న పూర్తవ్వగా మ‌రో 40 నెల‌ల పాల‌న మాత్రమే ఉంది. స్థానిక సంస్థల [more]

Update: 2021-01-31 00:30 GMT

ఏపీలో టీడీపీ ప్రతిప‌క్షంలో వ‌చ్చి 20 నెల‌లు అవుతోంది. ఇప్పటికే ఒక వంతు పాల‌న పూర్తవ్వగా మ‌రో 40 నెల‌ల పాల‌న మాత్రమే ఉంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా రావ‌డంతో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. గ‌త ఎన్నిక‌ల నుంచి పోల్చి చూస్తే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు కాడి కింద ప‌డేశారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలే కాకుండా ఓడిన వారు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. బాప‌ట్ల, మాచ‌ర్ల, పాయ‌క‌రావుపేట, గుంటూరు వెస్ట్‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించినా కూడా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఇన్‌చార్జ్‌లు నిస్తేజంగా వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో అక్కడ పార్టీ బ‌తికి బ‌ట్టక‌డుతుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌నీసం అక్కడ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు స‌రైన అభ్యర్థులు అయినా దొరుకుతారా ? అన్న సందేహాలు పార్టీ వ‌ర్గాల్లోనే ఉన్నాయి.

చేయించిన సర్వేలో…

ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు స‌మీక్షలు, స‌మావేశాల పేరుతో ఎలా గంట‌ల త‌ర‌బ‌డి పార్టీ నేత‌ల బుర్రలు తినేసేవారో ఇప్పుడు కూడా అదే పంథాలో వెళుతున్నార‌ని పార్టీ నేత‌లే ప‌బ్లిక్‌గా విమ‌ర్శలు చేస్తున్నారు. అటు గంట‌ల త‌ర‌బ‌డి స‌మీక్షలు చేయ‌డంతో పాటు చంద్రబాబు త‌మ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ప‌నితీరుపై కూడా ప‌లు స‌ర్వేలు చేయిస్తున్నారు. ఇటీవ‌ల కొత్త క‌మిటీల నియామ‌కం జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌నితీరుపై చంద్రబాబు స్వయంగా చేయించిన స‌ర్వేలో 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ప‌ట్టే నాథుడు కూడా లేడ‌ని తేలింద‌ట‌.

ఇన్ ఛార్జులను నియమించినా….

మొత్తం 31 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జ్‌లు ఉన్నా.. వారు పార్టీని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తేలింద‌ట‌. ఇక మ‌రో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌లే లేరు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌లే పార్టీకి దొర‌క‌ని ప‌రిస్థితి ఉంది. మొత్తం ఈ 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిపై చంద్రబాబు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నార‌ని స‌మాచారం. ఇక ఇన్‌చార్జ్‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంద‌నుకుంటే పొర‌పాటే అవుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యేలు దూకుడు చూపించ లేక‌పోతున్నారు.

వీరి వల్ల పార్టీకి….

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌లో గంటా శ్రీనివాస‌రావు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగిందేమి లేద‌నే అంటున్నారు. అటు అదే విశాఖ న‌గ‌రంలో ప‌శ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న గ‌ణ‌బాబు కూడా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ బాబు సైలెంట్ అయిపోయారు. ఇక హిందూపురంలో బాల‌య్య సంగ‌తి స‌రేస‌రి. ఆయ‌న ఇటీవ‌ల చంద్రబాబుపై కోపంతో నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌డ‌మే త‌ప్పా.. బాల‌య్య నుంచి అంత‌కు మించి ఆశించ‌లేం. ఇక ప‌య్యావుల కేశ‌వ్‌కు కీల‌క‌మైన పీఏసీ ప‌ద‌వి క‌ట్టబెట్టినా కూడా అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. ఇటు రాష్ట్ర స్థాయిలోనూ యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

ఉన్నా లేనట్లే అన్నట్లు….

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామ‌రాజు అసలు పార్టీలో ఉన్నారా ? అనే సందేహాలు త‌లెత్తేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఉన్నంత‌లో ఒక్క తూర్పు గోదావ‌రి జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే బెట‌ర్ అనిపిస్తున్నారు. ఇక ఓవ‌రాల్‌గా చంద్రబాబు స‌ర్వేలో తేలిన‌ట్టుగా 47 – 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ప‌ట్టే నాథుడే లేక‌… పార్టీని ముందుండి న‌డిపించే వాళ్లు లేక పూర్తిగా డీలా ప‌డింది. ఈ ప‌రిస్థితి చ‌క్కదిద్దక‌పోతే ఇక్కడ పార్టీ గెలుపుపై ఆశ‌లు ఉండ‌వ్‌..! అదే జ‌రిగితే చంద్రబాబు మ‌రోసారి అధికారానికి దూరం కాక త‌ప్పదు.

Tags:    

Similar News