బాబు వద్దనుకున్నారా..? వాళ్లే వద్దన్నారా?

Update: 2018-12-09 02:30 GMT

తెలంగాణలో ప్రజాకూటమి గెలిస్తే ఆ క్రెడిట్ ఎక్కువగా ఓన్ చేసుకునేది తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలువురు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతల వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆ పార్టీ ప్రచారం అలానే ఉంది. గెలిస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వొచ్చు... మరి ప్రజాకూటమి ఓడిపోతే బాధ్యత ఎవరిది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, నిన్న ఎన్నికలు ముగిసాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో లగడపాటి మినహా అన్ని జాతీయ సంస్థల సర్వేలూ టీఆర్ఎస్ దే విజయం అని తేల్చేశాయి. మరి, టీఆర్ఎస్ విజయం సాధించడానికి కలిసివచ్చిన అంశాల్లో ప్రధానమైనది చంద్రబాబు నాయుడు ప్రచారం అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడం, కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం వంటివి ప్రజాకూటమికి మేలు కంటే కీడే ఎక్కువ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు లా మారిన పోరు

ప్రజాకూటమిలోని నాలుగు పార్టీల్లో తెలంగాణ టీడీపీ ఒక పార్టీ అన్నట్లుగా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే, రాహుల్ తో చంద్రబాబు భేటీ, కూటమి వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం ఎక్కువ కావడం, టీడీపీకి సీట్లు ముఖ్యం కాదు టీఆర్ఎస్ గెలుపే ధ్యేయం అని చెప్పడం వంటివి టీఆర్ఎస్ వర్సెస్ ప్రజాకూటమిగా ఉన్న వార్ కాస్తా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మార్చాయి. ఇలా జరిగితే టీఆర్ఎస్ కి చాలా మేలు. అందుకే, కేసీఆర్ వ్యూహాత్మకంగా చంద్రబాబును కార్నర్ చేస్తూ వచ్చారు. దానికి కౌంటర్ గా చంద్రబాబు మరింత రెచ్చిపోయి కేసీఆర్ ను విమర్శించారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే అని చెప్పడం వంటి కామెంట్లు కూడా ప్రజాకూటమికి నష్టమే చేసేలా ఉన్నాయి. ఇక, కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబుదే పెత్తనం అని టీఆర్ఎస్, కేసీఆర్ చేసిన వాదనలకు ఈ అన్ని అంశాలు బలాన్నిచ్చాయి.

కేసీఆర్ ను విమర్శించడంతో...

చంద్రబాబు హయాంలో తెలంగాణ అభివృద్ధి చెంది ఉండవచ్చు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఆయనకు, టీడీపీకి తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా బీసీ వర్గాల్లో, విద్యావంతులు, ఐటీ వర్గాల్లో మంచి ఇమేజ్ ఉండేది. కానీ, 2009 తర్వాత అది క్రమంగా తగ్గిపోయింది. 2014 వరకు కేవలం హైదరాబాద్ లోని సెటిలర్లలోనే టీడీపీకి కొంత పట్టు మిగిలింది. అప్పుడు జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. జిల్లాల్లో గెలిచిన కొన్ని సీట్లు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత ఛరిష్మాతోనే గెలవగలిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు టీడీపీ మరింత బలహీనమైంది. చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసినా కేవలం ఒక్క డివిజన్ మాత్రమే విజయం సాధించింది. దీనిని బట్టి చూస్తే టీడీపీ ప్రభావం తెలంగాణలో పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రచారం చేయాల్సి వస్తే... కేవలం తాను చేసిన అభివృద్ధి చెప్పి, ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి ఉంటే బాగుండేదని, అలా కాకుండా కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించడం న్యూట్రల్ గా ఉండే ప్రజల్లో, జిల్లాల్లో టీఆర్ఎస్ కు సానుకూలత పెంచే అవకాశం ఉందంటున్నారు.

అక్కడ ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు..?

తెలంగాణలో పొత్తుల్లో భాగంగా మొత్తం 13 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వీటిల్లో వరంగల్ పశ్చిమ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి, మక్తల్ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఎర్ర శేఖర్ పోటీ చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనే ఉద్దేశ్యంతోనే ఆయన ప్రచారానికి అభ్యర్థులు మొగ్గు చూపనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ లో తెలంగాణ సెంటిమెంట్ చాలా ఎక్కువ. చంద్రబాబు వచ్చి కేసీఆర్ తిడితే ఇక్కడి సామాన్య ప్రజలు కూడా హర్షించే అవకాశం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఈ మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయలేదు అంటున్నారు. ఇక పేపర్లలో కూడా చివరి రెండు రోజులు చంద్రబాబు ఫోటో లేకుండా ప్రజాకూటమి అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. ఒకవేళ 11న ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబును టీడీపీ నేతల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఆకాశానికెత్తుతారు. అదే, ఓడిపోతే గనుక ఈ పొత్తు పట్ల ముందు నుంచీ లోలోన వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి చంద్రబాబు తో పొత్తే పుట్టి ముంచిందని అనే అవకాశాలు మాత్రం ఉన్నాయి.

Similar News