‘‘పెద్దన్న’’గా మారి చంద్రన్న కంట్రోల్ చే్స్తారా....!!

Update: 2018-12-03 11:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన అనుభవ సారాన్నంతా తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం, ఎన్నికల పోలింగ్ లో ఆయన, తెలుగుదేశం పార్టీ అనుసరించే వ్యూహాలను అనుసరించడానికి కాంగ్రెస్ నేతలు రెడీ అయిపోయారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబునాయుడు ఇంటికి భారత జాతీయ కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ప్రజాకూటమి పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీయే నేతృత్వం వహించింది. టిక్కెట్ల పంపకాలన్నీ ఢిల్లీలోనే జరిగాయి. సీపీఐ, తెలంగాణ జనసమితి వంటి పార్టీలు తమకు దక్కిన స్థానాలపై అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కినా ఢిల్లీ నాయకత్వం వారిని ఒప్పించగలిగింది. బుజ్జగించింది.

ఎన్నికల వ్యూహాలను....

కానీ తెలంగాణలో ఎలక్షనీరింగ్ ఆషామాషీ కాదు. ఆవైపు అన్నిరకాలుగా బలమైన నాయకుడు కె.చంద్రశేఖర్ రావు ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న టీఆర్ఎస్ ఎన్నికల నాటికి సీన్ మార్చేస్తుందన్న అనుమానం కాంగ్రెస్ పార్టీ నేతల్లో లేకపోలేదు. అనుకూల పవనాలు వీస్తున్నా పోలింగ్ తేదీ నాడు చూపించే చొరవ, పనితనంపైనే గెలుపు అవకాశాలుంటాయి. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో సిసలైన నాయకత్వం లేదన్నది అంగీకరించాల్సిన విషయం. ఎలక్షనీరింగ్ లో వీరికి అనుభవం ఉన్నా వారి నియోజకవర్గాలకే అది పరిమితం. మరోవైపు నేతల మధ్య సమన్వం చేసే నేత కూడా లేరు. దీంతో ఈనెల 7వ తేదీన జరిగే పోలింగ్ పై కాంగ్రెస్ నేతలకే టెన్షన్ పట్టుకుందనడంలో ఆశ్చర్యం లేదు.

బాబు ఇంటికి క్యూ కడుతున్న.....

అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి ఆశాదీపంగా కన్పించారు. ప్రచారంతో పాటు పోలింగ్ వ్యూహరచనపై చంద్రబాబు వద్ద కాంగ్రెస్ నేతలు పాఠాలు నేర్చుకుంటున్నారు. గత రెండు రోజులుగా చంద్రబాబు ఇంటికి కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా క్యూ కడుతుండటం విశేషంగానే చెప్పొచ్చు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి రామచంద్ర కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు చంద్రబాబును కలుసుకుని ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తుండటం విశేషం. రానున్న నాలుగు రోజులు అత్యంత కీలకం కావడంతో చర్చలు మీద చర్చలు జరుపుతున్నారు.

లీడ్ చేస్తుంది బాబే.....

దీంతో పేరుకు ప్రజాకూటమి అయినా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందునుంచే చక్రం తిప్పుతున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు దాన్ని లీడ్ చే్స్తారని, తెలంగాణకు వచ్చే నిధులు,నీళ్లను అడ్డుకుంటారన్న ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాకూటమిలో భాగస్వామి అయి తెలంగాణలో కేవలం 13 స్థానాలలోనే పోటీ చేస్తున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రజాకూటమిలో కీ రోల్ పోషిస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ సయితం ఎన్నికల వ్యూహాన్ని చంద్రబాబు వద్ద కు వెళ్లి మరీ తెలుసుకోవడం విశేషం. మొత్తం మీద ప్రజాకూటమిలో చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషించనున్నారన్నది ఎన్నికలకు ముందే స్పష్టమయింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలోకి ప్రజాకూటమి వచ్చినా కాంగ్రెస్ ను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News