బైరెడ్డికి...బై...బై...చెప్పేసినట్లేనా?

Update: 2018-04-11 09:30 GMT

పని అయిపోగానే బైరెడ్డిని పక్కన పెట్టేశారా? బైరెడ్డిని పార్టీలోకి చేర్చుకోరా..? రాయలసీమ పరిరక్షణ సమితి, మాజీ తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భవితవ్యం ఏంటి? ఆయనను పార్టీలోకి రాకుండా అడ్డుకున్నదెవరు? ఇదే చర్చ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే మళ్లీ బైరెడ్డి టీడీపీలో చేరికకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

పార్టీని రద్దు చేసి.....

కర్నూలు జిల్లాలో పేరున్న నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పార్టీని పెట్టి రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలలో బైరెడ్డి తన పార్టీ తరుపున అభ్యర్థిని నిలబెట్టారు. ఆ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకపోవడంతో మనస్థాపం చెందిన బైరెడ్డి పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమ వాదం లేదని సంచలన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడే బైరెడ్డి టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు......

మరోవైపు కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికలు గత ఏడాది డిసెంబరులో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృ‌ష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ పోటీకి దిగారు. ఆ సమయంలో బైరెడ్డి తన అనుచరుడిని బరిలోకి దింపారు. అయితే స్వయంగా కేఈ ప్రభాకర్ బైరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో బైరెడ్డి కొంత శాంతించారు. తనను టీడీపీలోకి రాకుండా కేఈ ఫ్యామిలీ అడ్డుకుంటుందని భావించిన బైరెడ్డి ఈ ఎన్నికల్లో తన అనుచరుడిని బరిలోకి దింపారు. అయితే కేఈ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కేఈ ప్రభాకర్ బైరెడ్డితో చర్చలు జరిపారు.

టీడీపీ నేతల అభ్యంతరమే కారణమా?

దీంతో బైరెడ్డి తన అనుచరుడి చేత నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కేఈ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ బైరెడ్డి భేటీ అయ్యారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తుంది. కాని బైరెడ్డి ఇంతవరకూ టీడీపీ కండువా కప్పుకోలేదు. బైరెడ్డి చేరికకు కేఈ ఫ్యామిలీ అంగీకరించినా నందికొట్కూరు టీడీపీ నేత శివానందరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల తర్వాతే బైరెడ్డి టీడీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ ఆయన చేరిక ఆలస్యమవుతుండటానికి కారణం స్థానిక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటమే. మరి బైరెడ్డి ఏం చేయనున్నారో చూడాలి.

Similar News