ఈసారైనా ఒవైసీకి చెక్ పెట్టగలరా..?

Update: 2018-08-02 03:30 GMT

హైదరాబాద్ పాతబస్తీ అంటే ఎంఐఎంకి కంచుకోట. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో 35 ఏళ్లుగా ఎంఐఎం పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసీ మూడుసార్లుగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దిన్ ఓవైసీ 1984 నుంచి 2004 వరకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ప్రతీ ఎన్నికకూ వారికి మెజారిటీ పెరుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో అసదుద్దిన్ కు 2,02,454 ఓట్ల భారీ మెజారిటీ రావడం చూస్తే వారికి హైదరాబాద్ ఎంపీ సీటుపై ఉన్న పట్టు తెలుస్తోంది. ఈ స్థానం కింద మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉండగా, అందులో గోషామహాల్ తప్ప మిగతా ఆరుస్థానాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం, వారిలో ఎంఐఎంకు మంచి పట్టు ఉండటంతో ఇది సాధ్యపడుతోంది. సలావుద్దిన్ ఓవైసీ హయాం నుంచే ఎంఐఎంకి ఇక్కడ గట్టి పునాదాలు ఏర్పడ్డాయి. ఆయన ఇక్కడి పేద ముస్లింలకు ప్రతినిధిగా ఎదిగారు. జీవించి ఉన్నంత కాలం వారి పక్షాన గొంతెత్తి పోరాడేవారు. తండ్రి వారసత్వాన్ని అసద్ కూడా కొనసాగిస్తూ అదే బాటలో వెళుతున్నారు.

అసద్ పై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్ఠానం

అయితే, ఇప్పుడు ఎంఐఎం కేవలం పాతబస్తీకి పరిమితమై లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. ముస్లింలు ఎక్కువ ఉన్న స్థానాల్లో గెలుస్తోంది. బీజేపీ విధానాలపై అసద్ పార్లమెంట్ వేదికగా గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో మోదీ-షా ధ్వయం దృష్టి అసదుద్దిన్ పై పడింది. ఆయనను సొంత స్థానంలోనే ఓడించి దెబ్బ కొట్టాలని భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్ కి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆ దిశగా రాష్ట్ర నాయకత్వానికి సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో హిందూ యువతలో బాగా పట్టు సంపాదించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజాసింగ్ అసద్ పై పోటీకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, అసదుద్దిన్ పై గెలుపు అంత సులువు కాదు. ఇక కాంగ్రెస్ కూడా పాత మిత్రుడి, ఇప్పటి శత్రువైన అసదుద్దిన్ పై పీకల దాక కోపంతో ఉంది. అసద్ పై మాజీ క్రికెటర్ అజారుద్దిన్ ను పోటీ చేయించాలని భావించింది. కానీ, అజారుద్దిన్ మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. హైదరాబాద్ సీటు సేఫ్ కాదని ఆయన ఉద్దేశ్యం అయి ఉండొచ్చు.

నిజాయితీగా పోలింగ్ జరిపితే .....

పార్టీ ఆదేశిస్తే అసదుద్దిన్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎన్నికలు సక్రమంగా జరిగితే తాను కచ్చితంగా గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. 25 ఏళ్లుగా హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం కబ్జా చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. బోగస్ ఓట్లు వేయించడం, పోలింగ్ బూత్ లను ఆధీనంలోకి తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడటం ద్వారా ఆ పార్టీ గెలుస్తోందనేది ఆయన ఆరోపణ. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉండటంతో ప్రభుత్వం కూడా ఎంఐఎంకి సహకరిస్తుందని రాజా సింగ్ అంటున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 6 లక్షల 50 వేల మంది హిందు ఓటర్లు, 8 లక్షలు మంది ముస్లింలు ఉన్నారని, కానీ వాస్తవానికి మాత్రం హిందువులదే మెజారిటీ అని ఆయన వాదిస్తున్నారు. ప్రతి డివిజన్ ఎంఐఎం 20 వేల నుంచి 50 వేల బోగస్ ఓట్లు వేయిస్తుందని ఆరోపిస్తున్నారు. ముస్లింల ఓట్లు ఏకపక్షంగా మజ్లీస్ కి పడుతున్నాయని, కానీ, హిందువుల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీలకు చీలుతున్నాయని అంటున్నారు. అయినా, తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని, బయోమెట్రిక్ ఉపయోగించి ఓటింగ్ నిర్వహించాలని రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నారు. నిజాయితీగా పోలింగ్ జరిపితే 200 శాతం కంచుకోటలో ఎంఐఎంను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే హిందూ ఓటర్లలో బీజేపీవైపే మొగ్గు ఉండే అవకాశం ఉన్నా, ముస్లిం ఓట్లు పెద్దఎత్తున చీలితే తప్ప అసదుద్దిన్ పై గెలిచే అవకాశం కనపడటం లేదు.

Similar News