మాజీలు మనసులు గెలిచారు....!!

Update: 2018-12-18 08:30 GMT

రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను బద్ధ శత్రువుల్లా భావిస్తుంటారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతుంటారు. ఎన్నికల వేళైతే చెప్పాల్సిన పని లేదు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఇది మరీ ఎక్కువ. అయితే, ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రులు మాత్రం ఎంతో హుందాగా ప్రవర్తించి అందరి మనసులు గెలిచారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోగా మూడు రాష్ట్రాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకున్న విషయం తెలిసింది.

అల్లుడికి అత్త ఆత్మీయ అభినందనలు

రాజస్థాన్ లో ముఖ్యమంత్రిగా సీనియర్ నేత అశోక్ గెహ్లోత్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ బాధ్యతలు తీసుకున్నారు. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం నిన్న రాజధాని జైపూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల ప్రముఖులతో పాటు తాజా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా హాజరయ్యారు. ఆమె అందరు నేతలను ఆప్యాయంగా పలుకరించడంతో పాటు బాధ్యతలు స్వీకరించిన ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన మధ్యప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అభినందించారు. జ్యోతిరాధిత్య... వసుంధరకు స్వయాన మేనల్లుడు. ఆయన తండ్రి మాధవరావు సింధియా... వసుంధరా రాజే అన్నాచెల్లెల్లు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో ఉండగా... మాధవరావు సింధియా 2001లో విమాన ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆయన వారసుడిగా జ్యోతిరాధిత్య సింధియా రాజకీయాల్లోకి వచ్చి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

చేతులు కలిపిన శివరాజ్...

ఇక, మధ్యప్రదేశ్ లో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తన హుందాతనంతో అందరి మన్ననలు పొందారు. ఇటీవలి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్ నాధ్, ఉప ముఖ్యమంత్రిగా జ్యోతిరాధిత్య సింధియాలు బాధ్యతలు తీసుకున్నారు. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ఆయన పదవీబాధ్యతలు చేపట్టిన ఇద్దరికీ అభినందనలు తెలపడంతో పాటు వారితో చేతులు కలిపి అభివాదం చేశారు. దీంతో సభకు వచ్చిన వారంతా అరుపులు, చప్పట్లతో హోరెత్తించారు. ఇక చత్తీస్ గఢ్ లోనూ అధికారం కోల్పోయిన రమణ్ సింగ్ అంతే హుందాగా ప్రవర్తించారు. నిన్న ఆ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో కాంగ్రెస్ నేత భూపేశ్ బాగెల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రమణ్ సింగ్ హాజరై ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు. మొత్తానికి ఎన్నికల్లో ఓడినా ఈ ముగ్గురు తాజా మాజీ ముఖ్యమంత్రులు ప్రజల మనసులు మాత్రం గెలిచారు.

Similar News