భూమాకు ఈసారి రాం..రాం...!!

Update: 2018-12-07 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత టిక్కెట్ల కేటాయింపుల్లో ఈసారి అనూహ్య మార్పులుచేసే అవకాశముంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపైన కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా పలు సమావేశాల్లో చెప్పారు.కేసీఆర్ అతి విశ్వాసానికి వెళ్లి సిట్టింగ్ లకు టిక్కెట్లుఇచ్చారని, ఆయనకు గెలుపు కష్టమేనని కూడా చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. మరి ఇందులో ఎవరిని తప్పిస్తారు? ఎవరికి సీట్లు ఇస్తారు? అన్నది ఇప్పటికి్ప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా ఆ దిశగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన కదలికలే చెబుతున్నాయి.

వైసీపీ బలంగా ఉండటంతో....

కర్నూలు జిల్లా విషయం తీసుకుంటే ఇక్కడ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం అత్యంత కీలకమైనది. ఇక్కడ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నంద్యాల పార్లమెంటు సభ్యుడిగా ఎస్పీవై రెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుపై గెలిచినా ఎన్నికల అనంతరం ఆయన టీడీపీ గూటికి చేరిపోయారు. అయితే ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా పోటీ చేయరన్నది దాదాపు ఖాయమైనట్లే. ఆయన స్థానంలో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన కుటుంబానికే పార్లమెంటు టిక్కెట్ ఇస్తారని ప్రచారం కూడా జరిగింది.

గంగులకు ఎంపీ అభ్యర్థిత్వం....

కానీ ఎస్పీవై రెడ్డి మాత్రం తమకు నంద్యాల అసెంబ్లీ సీటు కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి ఆయన గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు ఎంపీ సీటు అక్కరలేదని, తనఅల్లుడికి నంద్యాల టిక్కెట్ ఇస్తే చాలని ఆయన పార్టీ అధినేత ఎదుట ఇటీవల కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన నేత కావడంతో ఎస్పీవై రెడ్డి మాటను కాదనలేని పరిస్థితి. ఎంపీ అభ్యర్థిగా దాదాపు గంగుల ప్రతాప్ రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆయనకు విజయావకాశాలున్నాయని సర్వే రిపోర్టులు అందడంతో నంద్యాల పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సమావేశం కావాలని కూడా చంద్రబాబు ఇచ్చిన ఆదేశంతో గంగుల అదేపనిలో ఉన్నారు.

ఎస్పీవై రెడ్డి అల్లుడికి....

దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి నంద్యాల సీటు భూమా బ్రహ్మానందరెడ్డికి దక్కే అవకాశాలు లేవంటున్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల బాధ్యతను ఎస్పీవై రెడ్డికి అప్పగించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి గత ఉప ఎన్నికల్లోనూ సర్వశక్తులు ఒడ్డిస్తేనే విజయం సాధ్యమయింది. ఈసారి అది సాధ్యం కాదు. అంతేకాకుండా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం కూడా ఎస్పీవై ఫ్యామిలీకి కలసి వచ్చిందంటున్నారు. భూమా కుటుంబానికి వచ్చేఎన్నికలలో ఆళ్లగడ్డ మినహా మరోస్థానం దక్కే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీదచంద్రబాబు సిట్టింగ్ ల చీటీలచించే పనిలో ఉన్నారన్నది మాత్రం వాస్తవం.

Similar News