అంతన్నారు...ఇంతన్నారే... ...?

Update: 2018-12-12 11:00 GMT

బిజెపి లో హేమా హేమీలంతా తెలంగాణ ఎన్నికల్లో మట్టికరిచారు. ఈ మహా ఓటమికి కారణం స్వయం కృతమనే విశ్లేషకులు లెక్కేస్తున్నారు. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఎన్నిక కాకపోతే మొత్తం పరువు గంగ పాలు అవునని అంటున్నారు. గెలిచే అవకాశాలు చేతులారా నీరుగార్చారని వాపోతున్నారు ఆ పార్టీ నాయకులు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎన్ విఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి తదితరులంతా తమ సమీప గులాబీ పార్టీ అభ్యర్థుల చేతిలో పరాజయం మూటకట్టుకున్నారు. కొత్త స్థానాల మాట అటుంచి సిట్టింగ్ స్థానాలు సైతం కృష్ణార్పణం అయిపోయాయి బిజెపికి.

ఒంటరిగా పోటీ చేస్తే....

బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇదేరకమైన ఫలితాలు రాకతప్పదంటున్నారు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి కొద్దోగొప్పో బలం ఉంది. అయినా కూడా ఎక్కడా గెలవని పరిస్థితి నెలకొంది. దీనికి గల కారణాలను అన్వేషించడంలో పడ్డారు కమలనాధులు. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ సయితం ఓటమిపాలుకావడంతో బీజేపీ డీలా పడింది. ఏపీలోనూ ఇలాంటి ఫలితాలే రిపీట్ అవతాయన్న టాక్ బలంగా విన్పిస్తోంది.

కారణాలివేనా.....

అసెంబ్లీ లోను మిత్రులు కానీ మిత్రులుగా నడుచుకోవడం, పార్లమెంట్లో మోడీ సర్కార్ కి ఎంపీలు లోపాయికారీ మద్దతు, ప్రధానితో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కమలం క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తూ వచ్చాయి. కేసీఆర్, బిజెపి కలిసే ఎన్నికలకు వెళతారనే సంకేతాలు వెళ్లాయి. ఫలితంగా టీఆరెస్ పై తీవ్రస్థాయిలో దూకుడుగా వెళ్లలేని పరిస్థితిని కమలానికి ఏర్పడ్డాయి. దాంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ ఒంటరి పోరుకే సిద్ధం అయ్యారు. ఈ వ్యూహానికి ప్రతివ్యూహం సిద్ధం చేసుకోలేకపోయిన బిజెపి యుద్ధం లో పూర్తిగా వెనుకబడిపోయింది.

Similar News