ఇక్కడ ఎంత కిందా మీదా పడినా...??

Update: 2018-12-16 11:00 GMT

ద‌క్షిణాది రాష్ట‌మైన ఏపీలో పావులు క‌ద‌పాల‌ని, పార్టీని ఇక్క‌డ పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకున్న ఆశ‌లు నిన్న‌టి తెలంగాణా ఫ‌లితాల‌తో బూడిద‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణాలో ఐదు స్థానాల్లో విజ‌యం సాధించిన క‌మల నాధులు ఇప్పుడు చ‌చ్చీ చెడీ ఒక్క‌స్థానానికి ప‌డిపోయారు అది కూడా అత్యంత ద‌య‌నీ య‌మైన విజ‌యంగానే క‌నిపిస్తోంది. దీంతో ఏపీలో ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ కూడా ఇదే పున‌రావృతం అవుతుందా? అనే చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును బీజేపీ 2014లో కైవ‌సం చేసుకుంది. అదికూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన ఫ‌లితంగా ద‌క్కిన విజ‌యాలే.!

ఒంటరిగానేనా?

కానీ, నేడు టీడీపీతో తీవ్ర‌మైన వైరం పెట్టుకుని ఒంట‌రిపోరుకు దిగుతోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న టీడీపీతో చేతులు క‌లిపింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను, రెండు లోక్‌స‌భ స్థానాల్లోనూ బీజేపీ విజ‌య సాధించింది. అయితే, నాలుగేళ్లు గ‌డిచే స‌రికి చంద్ర‌బాబుతో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా టీడీపీకి బీజేపీ దూర‌మైంది. అయిన‌పప్ప‌టికీ.. ఏపీలో పావులు క‌దిపి.. చంద్ర‌బాబుకే దిమ్మ‌తిరిగేలా చేయాల‌ని క‌మ‌ల నాథులు భావించారు. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన ప‌శ్చ‌మ గోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌ను రంగంలోకి దింపి రాజ‌కీయాల‌ను వేడెక్కించాల‌ని బీజేపీ నేత‌లు వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

అంతర్గత కసరత్తు.....

ఇక‌, అప్పట్లో కీలకంగా వ్యవహరించిన సీనియర్లు ఈసారి ఇప్పటి నుంచే బరిలోకి దిగితే తప్ప ఆశించిన ఫలితా లు రాబట్టలేమన్న భావనతో బీజేపీ ఇప్పటికే అంతర్గత కసరత్తు ఆరంభించింది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గోకరాజు గంగరాజును బరిలోకి దింపడం ద్వారా గత ఎన్నికల్లో నేరుగా బీజేపీ విజయాన్ని సొంతం చేసుకో గలిగింది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలున్న పైడికొండల మాణిక్యాలరావును తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా ఇలాంటి విజయాన్నే చేజిక్కించుకోగలిగింది. తొలిసారి జిల్లాలో ఒక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందడం దాదాపు అదే ప్రథమం.

కామినేని ప్రకటన తర్వాత....

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని కాద‌ని, ప‌వ‌న్‌తోను, జ‌గ‌న్‌తోనూ క‌లిసి వెళ్ల‌లేక ఒంట‌రి పోరుకు దిగితే.. ఉన్న నాలుగు కాదు క‌దా.. క‌నీసం ఒక్క‌టి కూడా ద‌క్కే ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూర‌మ‌ని ఇటీవ‌ల కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అదేవిధంగా విశాఖ నుంచి గెలిచిన మ‌రో నాయ‌కుడు విష్ణు కూడా బీజేపీతో అంటీ ముట్ట‌న‌ట్టే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబును కాద‌ని చేసే ఒంట‌రిపోరులో ఎన్ని చోట్ల బీజేపీ గెలుస్తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఆర్థికంగా స్థితి మంతుడు కావూరి సాంబ శివరావు వంటి వారు ఉన్నా.. ఆయ‌న కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ త‌ర‌ఫున బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది క‌నిపించ‌డం లేదు.

అట్టర్ ప్లాన్ తప్పదా?

అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజును వాడుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. అయితే, ఈయ‌న కూడా కావూరి బాట‌లోనే ప‌య‌నిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు సుముఖంగా లేర‌ని, తాజా తెలంగాణా ఫ‌లితాలతో ఈయ‌న కూడా ప్ర‌చారానికి పోటీకి కూడా దూరంగా ఉండే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రోప‌క్క‌, పురందేశ్వ‌రి ఉన్నా. ఆమె హ‌వా ఏపాటిదో హైద‌రాబాద్‌లో ఇప్పుడు అర్ధ‌మైపోయింది. ఆమెప్ర‌చారం చేసిన చోట బీజేపీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఇక‌, సోము వీర్రాజు త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌ని ర‌గిలిపోతున్నారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా చూస్తే.. బీజేపీ ఏపీలో అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డం త‌థ్య‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

Similar News