బయటకు వస్తే పరువు పోతుందా?

Update: 2018-12-15 02:30 GMT

కమలం కుదేలైపోయింది. తామే కీలకమవుతామన్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి జయకేతనం ఎగురవేస్తామన్న భారతీయ జనతా పార్టీనీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 118 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగింది. ఇందులో పది స్థానాలు తమవేనని నమ్మకంగా పోలింగ్ తర్వాత కూడా చెప్పింది. అయితే ఫలితాల తర్వాత బీజేపీ నేతలు కన్పించకూడా పోవడం విశేషం. చివరకు 105 స్థానాల్లో చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారు. అంటే 115 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం ధరావత్తు కూడా దక్కలేదు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దారుణంగా దెబ్బతిని.....

ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే కమలం పార్టీ తెలంగాణలో ఎంత దారుణంగా దెబ్బతినిందో ఇట్టే అర్థమవుతుంది. స్టార్ క్యాంపెయినర్లను ఎన్నికల ప్రచారంలోకి దించినా ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యానాధ్, రమణ్ సింగ్ లతో పాటు కేంద్రమంత్రులు పన్నెండుగురు ప్రచారం చేసినా ప్రజలు కమలం పార్టీ వైపు కూడా చూడలేదంటే అతిశయోక్తి కాదేమో. మొత్తం 80 వరకూ బహిరంగ సభలు నిర్వహించారు. అయినా ఒక్క సీటు కూడా కనాకష్టం మీద దక్కించుకుని తన ఉనికిని కాపాడుకుంది.

డిపాజిట్లు కూడా రాకుండా.....

భారతీయ జనాతాపార్టీ పోటి చేసిన 118 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కింది కేవలం 13 స్థానాల్లో మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు బీజేపీ గెలిచింది. నాడు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది. కానీ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బరిలోకి దిగిన ముషీరాబాద్, శాసనసభ పక్షనేతగా ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేసిన అంబర్ పేట్, ఖైరతాబాద్, ఉప్పల్, ఛార్మినార్, కరీంనగర్, కల్వకుర్తి, ముథోల్, భూపాలపల్లి, కార్వాన్, సూర్యాపేట నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ కొంత ప్రతిభ కనపర్చింది. అంబర్ పేట్, ఆదిలాబాద్, ముషీరాబాద్, చార్మినార్, కల్వకుర్తి, ఖైరతాబాద్, కార్వాన్, కరీంనగర్, మహేశ్వరం, ముధోల్, నారాయణ్ ఖేడ్, సూర్యాపేట, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లోనే కమలం పార్టీకి ధరావత్తు దక్కింది.

ఓట్ల శాతం కూడా తగ్గి....

గతఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేసినప్పుడు 7.5 శాతం ఓటు బ్యాంకును సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 7 శాతం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితమయింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలసి బీజేపీ 45స్థానాల్లో పోటీ చేసి 7.5 ఓట్ల శాతం తెచ్చుకోగా, ఈసారి 118 స్థానాల్లో పోటీ చేసి7శాతం ఓట్లను పొందడం గమనార్హం. తొలినుంచి ఈసారి సీట్లు పది వచ్చినా ఓట్ల శాతం పెరుగుతుందని కమలనాధులు గట్టిగా విశ్వసించారు. కానీ అది ఏమాత్రం పెరగకపోగా సీట్లు కూడా గణనీయంగా తగ్గడంతో బయటకు మొహం చూపేందుకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా కమలం పార్టీకి సమర్ధుడైన నాయకుడు కావాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Similar News