ఎలా చెప్పాలి...? ఏమని చెప్పాలి....?

Update: 2018-12-20 05:00 GMT

అమిత్ షాకు ఏం చెప్పాలి....? అధినేత ఏం క్లాస్ పీకుతారు? తెలంగాణలో ఘోరమైన ఓటమికి గల కారణాలను ఎలా విశ్లేషించాలి..? ఇదే తెలంగాణ బీజేపీ నేతలను వేధిస్తున్న ప్రశ్నలు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. మొత్తం 118 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఉద్దండులందరూ పరాజయం పాలయ్యారు. ఇందుకు కారణాలు అనేకం. నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలోనూ ప్రజల వద్దకు వెళ్లకపోవడం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. కానీ ఈ నెల 24వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

ఈనెల 24న షా రాక....

గత ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుతం ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నారు. దీంతో అమిత్ షా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ నాయకత్వ లోపం ఉందని గ్రహించిన అమిత్ షా నేతలకు క్లాస్ పీకేందుకే ప్రత్యేకంగా వస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల సమయానికి నేతలను సమాయత్తం చేయడానికే అమిత్ షా ప్రత్యేకంగా వస్తున్నట్లు సమాచారం. దీంతో బీజేపీనేతల్లో భయం పట్టుకుంది. గతంలో అమిత్ షా వచ్చినప్పుడే నేతల మధ్య విభేదాలున్నాయని స్పష్టంగా తెలిసింది.

రాజాసింగ్ నివేదిక కూడా....

దీనికి తోడు ప్రస్తుతం గెలిచిన ఒకే ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ గతంలో ఇక్కడి పార్టీ పరిస్థితిపై ప్రత్యేకంగా నివేదిక ఇచ్చారు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మరోనేత కిషన్ రెడ్డిల మధ్య సమన్వయం లేదని, పార్టీని పట్టించుకోవడం మానేసి సొంత ప్రయోజనాలకే నేతలు ప్రయత్నిస్తున్నారని గతంలోనే రాజాసింగ్ అమిత్ షాకు నివేదిక ఇచ్చారు. ఒకదశలో పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచన చేసిన రాజాసింగ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మరీ అమిత్ షా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. రాజాసింగ్ చెప్పినట్లుగానే ఫలితాలు ఉండటంతో అమిత్ షా పార్టీనేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకే హైదరాబాద్ పర్యటనను ప్రత్యేకంగా పెట్టుకున్నట్లు సమాచారం.

పార్లమెంటు ఎన్నికలపై.....

దీంతో పాటుగా తెలంగాణలో వరుసగా పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి. దీనికి సమాయత్తం చేయాలన్నది ఆయన ఆలోచన. పంచాయతీ ఎన్నికలకు కష్టపడితే పార్టీ సంస్థాగతంగా బలపడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి? ఎవరు పోటీ చేయాలన్న దానిపైనా స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు. కొందరికి ముందుగానే వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోమని అమిత్ షా చెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాల నేతలు అభిప్రాయపడుతున్నాయి. మరి పార్లమెంటు ఎన్నికల్లోనైనా కమలదళం సత్తా చాటుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే.

Similar News