ఎదురు చూపులు...!!!

Update: 2018-12-08 18:29 GMT

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ గుబులు పట్టుకుంది. మంత్రి వర్గ విస్తరణ చేపడితే పరిస్థితులు ఎటు మారతాయోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లలోనూ లేకపోలేదు. కొద్ది నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణను ఈ నెల 22వ తేదీన చేపడతామని కాంగ్రెస్ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు పదవుల పందేరం ఉంటుందని కూడా సంకేతాలు పంపారు. వివిధ నామినేటెడ్ పోస్టులను మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే పూర్తి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

విస్తరణ జరిపితే.....

అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ లు రాహుల్ తో సమావేశమై మంత్రి వర్గ జాబితాకు సీల్ వేయించుకోవాల్సి ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా రాహుల్ కు మంత్రి వర్గం జాబితా అందజేసినా ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా విస్తరణ ఉంటుందని పీసీీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కూడా చెప్పడంతో ఆశావహులు కొందరు హస్తిన బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 11వ తేదీన వెలువడనున్నాయి. ఆ తర్వాత రాహుల్ అపాయింట్ మెంట్ వీరికి దొరికే అవకాశముంది.

తమ చెంతకే వస్తారంటున్న.....

మంత్రి వర్గ విస్తరణ ఎంత త్వరగా జరిగితే అంత తమకు మంచిదన్న భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. విస్తరణ ఒకసారి జరిగితే అసంతృప్తులు తమంతట తామే కమలం గూటికి వస్తారన్న ధీమాలో ఉంది. అందుకోసమే ఈనెల 22 వతేదీ వరకూ వేచి చూడాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. విస్తరణలో చోటు దక్కని వారు ఖచ్చితంగా తమవైపు చూస్తారన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. తామేమీ ఆపరేషన్ ఆకర్ష్ చేయనవసరం లేదని, వారంతట వారే తమ గూటికి చేరతారన్న విశ్వాసంలో భారతీయ జనతా పార్టీ నేతలున్నారు.

జారిపోకుండా......

కాని అసంతృప్తులు చేజారి పోకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మంత్రి వర్గంలో చోటు దక్కని వారిని నేరుగా రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి ఆయన చేత హామీ ఇప్పించాలన్న ఉద్దేశ్యంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, పరమేశ్వర్, డీకే శివకుమార్ లు సమావేశమై మంత్రి వర్గ విస్తరణ చేపడితే తలెత్తే పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరూ తమ నుంచి చేజారిపోయే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓ మూలన మాత్రం అనుమానం వారిని వదలడం లేదు.

Similar News