థాక్రే దిగివస్తారా.....?

Update: 2018-12-21 17:30 GMT

బీజేపీ కేంద్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ఒకవైపు వరుసగా మిత్రులు దూరం అవుతుండటం ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. మరోవైపు విపక్షాల కూటమి కూడా బలోపేతం అవ్వడంపై ఆందోళన వ్యక్త మవుతోంది. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో దాదాపు కూటమికి రెడీ అయిపోయాయి విపక్షాలు. ఇలా మిత్రులందరినీ దూరం చేసుకుంటూ వెళితే కష్టమని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్ లు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకున్నా కొందరి సహకారం అవసరం ఉంటుందన్న ఆలోచనలో కమలనాధులు ముందు జాగ్రత్త పడుతున్నారు.

మంచిచేసుకునే ప్రయత్నంలో.....

ఇందులో భాగంగా శివసేనను మంచి చేసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ శివసేన నరేంద్రమోదీకి, అమిత్ షాకు వ్యతిరేకంగానే వ్యాఖ్యానాలు చేస్తుంది. వారికి బీజేపీ పార్టీ పట్ల సదభిప్రాయమే ఉన్నా నాయకత్వమే వారికి నచ్చడం లేదు. అందుకే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ఏడాది క్రితమే ప్రకటించారు. అయినా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రులుగా ఆ పార్టీ సభ్యులు కొనసాగుతున్నారు.

అత్యధిక స్థానాలను.....

మహారాష్ట్రంలో మొత్తం 48 లోక్ సభ స్థానాలున్నాయి. అందుకే ఈ రా‌ష్ట్రంలో మళ్లీ విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ భావిస్తుంది. మరాఠా రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇటీవల పార్టీకి కొంత ఇమేజ్ వచ్చింది. శివసేనకూడా దీనికి సానుకూలంగా ఉంది. గత ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ 23 స్థానాల్లో ఇక్కడ గెలిచింది. శివసేన 18 స్థానాల్లో గెలిచింది. ఈ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే కలసి పోటీ చేయడమే మేలన్న అభిప్రాయం ఇరు పార్టీల్లో వ్యక్తమవుతుంది. మరాఠా రిజర్వేషన్ల ప్రకటన తర్వాత శివసేనలో కొంత మార్పు కన్పిస్తుందంటున్నారు.

భేటీ కోసం.....

అందుకే అమిత్ షా మరోసారి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే మరోసారి వీరి సమావేశం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్దవ్ థాక్రే ప్రధానంగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు అమిత్ షా త్వరలోనే థాక్రేను కలవనున్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత కుదురుతుందన్న ఆశాభావం కమలం పార్టీలో కన్పిస్తుంది. అదే జరిగితే మహారాష్ట్రలో మేజర్ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవచ్చన్న అంచనాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరి థాక్రే దిగివస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Similar News