సర్దుకుపొమ్మన్నా...వినడేందయ్యా..??

Update: 2018-12-13 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారిద్దరి మధ్య వారు నలిగిపోతున్నారు. ఇద్దరూ ఇలాగే వ్యవహరిస్తే తమకు నష్టం చేకూరుతుందని వారు భావిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. భయపడిపోతున్నారు. ఇద్దరిలో ఒకరయినా తగ్గితే బాగుండని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వారెవరో కాదు వైసీపీకి చెందిన కాపు సామాజికవర్గం నేతలు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతలు భయం బయలుదేరిందనే చెప్పాలి.

తిట్ల పురాణాలతో....

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రగడ ప్రారంభమయింది. తిట్ల పురాణానికి ఇరు పార్టీల అగ్రనేతలూ నేరుగానే రంగంలోకి దిగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పవన్ కల్యాణ్, జగన్ లు ఇద్దరూ కొన్ని నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అధికారంలో ఉండటంతో ఇద్దరూ వారిపై పెద్దయెత్తున అవినీతి ఆరోపణలు చేశారు. అయితే తొలిసారి పవన్ జగన్ పై విమర్శలుచేయడంతో జగన్ కూడా వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో కాపు నేతలు జగన్ కు కొంత సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ సైలెంట్ అయ్యారు.

వ్యక్తిగత దూషణలతో....

కానీ గత పదిరోజులుగా మళ్లీ పవన్, జగన్ ల మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ జైలుకెళ్లాల్సిందేనని పవన్ జగన్ పై హాట్ కామెంట్స్ చేయడంతో మళ్లీ అగ్గిరాజుకుంది. జగన్ చేస్తున్నట్లుగా చెబుతున్న అవినీతి గురించి ఆధారాలను చూపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై జగన్ పవన్ పై సీరియస్ కామెంట్స్ చేయడంతో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. మరోసారి పవన్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని జగన్ లేవనెత్తారు. పవన్ పవిత్ర కార్యంగా భావించే పెళ్లిని అపహాస్యంచేశారని జగన్ మండిపడ్డారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు దూషణలు, భూషణలకు దిగడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అయోమయంలోకి వెళ్లారు. డీలా పడ్డారు కూడా.

కాపు నేతల్లో కలవరం.....

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగాతూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు నేతలు ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉండటంతో వారికే అన్ని పార్టీలూ టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. నాలుగున్నరేళ్లుగా వైసీపీ లో ఉంటూ పార్టీని పటిష్టం చేసుకున్న కాపు సామాజికవర్గం నేతలు రెండు పార్టీల అగ్రనేతల మధ్య వార్ తో ఈ ప్రాంత కాపు నేతలు నలిగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారితే తమ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. పవన్ పట్ల కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించాలని జగన్ కు చెప్పినా విన్పించుకోవడం లేదని వారు వాపోతున్నారు. మొత్తం మీద వీరిద్దరి చెలగాటం నేతలకు ప్రాణ సంకటంగా మారిందనే చెప్పాలి.

Similar News