టెన్షన్ కు తెరదించేశారు.. అందుకే వెనక్కు తగ్గారు

తెలుగుదేశం పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని వైసీపీ సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ మొన్నటి దాకా విన్పింిచిన ఒక పేరు మాత్రం ఇప్పుడు [more]

Update: 2020-10-15 14:30 GMT

తెలుగుదేశం పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని వైసీపీ సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ మొన్నటి దాకా విన్పింిచిన ఒక పేరు మాత్రం ఇప్పుడు మాయమైపోయింది. నిన్న మొన్నటి వరకూ ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరతారని అందరూ భావించారు. అయితే ఆయన సడెన్ గా తన స్టాండ్ ను బయటపెట్టారు. తాను పార్టీని వీడేది లేదని చెప్పారు. ఆయనే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్.

తొలి నుంచి టీడీపీకి…..

ఇచ్ఛాపురం నియోజకవర్గం అంటే తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఏడు సార్లు గెలిచింది. ఒక్క 2004లోనే టీడీపీ ఓటమి పాలయింది. మొన్నటి ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా ఇచ్ఛాపురంలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. పైగా జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను ఇచ్ఛాపురంలోనేే ముగించి భారీ బహిరంగసభను కూడా పెట్టారు. అయినా ఇక్కడ టీడీపీ గెలవడం దానికున్న పట్టుకు కారణమని చెప్పాలి.

రెండుసార్లు గెలిచి…..

ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖకు పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఆయన కూడా వైసీపీకి వెళతారని ప్రచారం జరిగింది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. నియోజవర్గంలో పనులు ఏవీ కాకపోవడం ఒకటి. అందుకే బెందాళం అశోక్ గత కొద్ది నెలలుగా మౌనంగా ఉన్నారంటున్నారు. ఆయన పార్టీ మారడం ఖాయమని కూడా పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

పార్టీలోనే కొనసాగుతానని…..

అయితే వీటన్నింటికి తెరదించుతూ బెందాళం అశోక్ తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీని వీడే ఉద్దేశ్యం లేదని చెప్పారు. అంతటితో ఆగకుండా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా ఇందుకు ఊతమిస్తుంది. బెందాళం అశోక్ కింజారపు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అచ్చెన్నాయుడుకు రాష్ట్ర పగ్గాలు దక్కుతుండటంతో పార్టీ మారే ఆలోచనను ఆయన విరమించుకున్నారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద పార్టీ మారనని బెందాళం అశోక్ చెప్పడంతో తెలుగుదేశం అధినాయకత్వం ఊపిరి పీల్చుకుంది.

Tags:    

Similar News