బాలయ్యకు పక్కలో బల్లెం కోసం జగన్...?

Update: 2018-12-06 13:30 GMT

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ఈసారి హిందూపురంలో కొంత వ్యతిరేకత కనపడుతుంది. బాలకృష్ణ ఎక్కవగా నియోజకవర్గంలో ఉండకపోవడం, ఆయన పర్సనల్ అసిస్టెంట్లే కథ మొత్తం నడుపుతుండటం గత నాలుగున్నరేళ్లుగా సొంత పార్టీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశానికి పెట్టని కోట. అది అందరికీ తెలిసిందే. దివంగత ఎన్టీ రామారావు దగ్గర నుంచి నందమూరి బాలకృష్ణ వరకూ ఆ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. 1985 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండాయే అక్కడ రెపరెపలాడింది. అభ్యర్ధులు మారారు కాని జెండా మాత్రం మారలేదు. అందుకే బాలయ్య కూడా ఇదే తనకు సేఫ్ నియోజకవర్గమని హిందూపురాన్ని ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ హిందూపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నవీన్ నిశ్చల్ ను తప్పించి.....

అయితే జగన్ ఈసారి హిందూపురం నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ హిందూపురం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నవీన్ నిశ్చల్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన అయితే మళ్లీ ఓటమి గ్యారంటీ అని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చి బాలయ్యకు చెమటలు పట్టించాలన్నది జగన్ వ్యూహంగా కన్పిస్తోంది. 2009లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ ఘనీని పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అబ్దుల్ ఘనీ అయితే బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా అనూహ్యంగా గెలిచే అవకాశాలున్నాయని కూడా సర్వేలు తేల్చి చెప్పడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

వరుసగా ఓటమి పాలవుతూ....

నవీన్ నిశ్చల్ గత నాలుగేళ్లుగా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఆయన 2004 నుంచి వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు.ఈసారి నవీన్ నిశ్చల్ కు టికెట్ ఇస్తే హిందూపురం కోల్పోతామని భావించిన జగన్ తెలుగుదేశం నుంచి అబ్దుల్ ఘనిని తీసుకోవాలని నిర్ణయించారని తెలిసింది. ఈ మేరకు అబ్దుల్ ఘనికి జగన్ శిబిరం నుంచి కబురు వచ్చిందంటున్నారు. అబ్దుల్ ఘని అభ్యర్థిగా పోటీకి దింపితే కొంతవరకూ బాలయ్యను వచ్చే ఎన్నికల ప్రచారంలో కట్టడి చేయవచ్చన్నది కూడా వైసీపీ వ్యూహంగా కన్పిస్తోంది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేను....

మరి అబ్దుల్ ఘని వల్ల పార్టీకి ఎంతమేరకు లాభమో తెలియదు కాని ఇప్పటి వరకూ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసిన నవీన్ నిశ్చల్ ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలియడం లేదు. ఆయనకు అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని జగన్ ఇప్పటికే ప్రామిస్ చేసినా ఆయన అనుచరులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతారని సన్నిహితులు చెబుతున్నారు. నవీన్ నిశ్చల్ ను ఒప్పించగలిగి పార్టీలోనే కొనసాగించ గలిగితే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ జోరుకు కళ్లెం వేసే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద జగన్ పాదయాత్రలో ఉండికూడా నియోజకవర్గ ఇన్ చార్జుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

Similar News