అవంతి అనుకున్నది సాధించేటట్లుందే.....!!

Update: 2018-10-14 08:00 GMT

విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. చాలా కాలం క్రితమే ఆయన ఈ విషయం అధినాయకత్వం చెవిన వేశారని, గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని ప్రచారంలో ఉంది. ముత్తంశెట్టి తాను 2009లో పోటీ చేసిన భీమునిపట్నం నుంచి బరిలో నిలవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. దాంతో పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది.

పట్టుపడుతున్న గంటా.....

భీమిలీ నుంచి మరో మారు పోటీకి మంత్రి గంటా రెడీ అంటున్నారు. ఈసారి తాను జెండా మార్చేది లేదు. అసెంబ్లీ సీటునూ మార్చేది లేదని ఆయన క్లారిటీతో చెప్పేస్తున్నారు. గంటా, ముత్తంశెట్టి మంచి మిత్రులే కానీ సీటు వారిద్దరి మధ్యనా తంటా పెడుతోంది. నిజానికి ముత్తంశెట్టిని రాజకీయాల్లోకి పరిచయం చేస్తూ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ద్వారా టికెట్ ఇప్పించింది గంటాయే. ఆ తరువాత 2014 ఎన్నికల్లో తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పి ముత్తంశెట్టికి పార్లమెంట్ దారి చూపించింది కూడా మంత్రి గారే.

షరతు ఉందట.....

అయితే ముత్తంశెట్టి తాను 2019లో మళ్ళీ భీమిలీ నుంచి పోటీ చేస్తానని, అపుడు వేరే సీటు మంత్రి చూసుకోవాలని చెప్పిన మీదటనే అనకాపల్లి ఎంపీ సీటుకు షిఫ్ట్ అయ్యారట. షరతు ప్రకారం ముత్తంశెట్టి మళ్ళీ భీమిలీ నుంచి తయార్ అంటూంటే గంటా మాత్రం నో చెబుతున్నారట. దాంతో మిత్రులు ఇద్దరూ సీటు కోసం శత్రువులు అయిపోయారు. ఈ తగవు తీర్చడానికి హై కమాండ్ కి తల ప్రాణం తోకలోకి వస్తోందట.

వయా మీడియాగా.....

ఇక టీడీపీ హై కమాండ్ కి గంటా, ముత్తంశెట్టి ఇద్దరూ కావాల్సిన వారే. ఇద్దరూ ఎక్కడ సీటు ఇచ్చినా గెలుస్తారన్న పేరు ఉంది. పైగా కాపు సామాజికవర్గం నాయకులు. దాంతో మొదట గంటానే కదపాలని చూశారు. అయితే ససేమిరా అని మంత్రి అనడంతో ఇపుడు ఎంపీ గారి వద్దకు రాయబేరాలు వెళ్తున్నాయి. వచ్చే ఎనికల్లో వేరే సీటు ఇస్తామని చెబుతున్నారట.

మాడుగుల నుంచి.....

అనకాపల్లి ఎంపీగా పనిచెస్తున్న ముత్తంశెట్టికి దగ్గరలోని అసెంబ్లీ సీటునే టీడీపీ అధినాయకత్వం చూపించిందట. మాడుగుల అయితే బెటర్ చాన్సెస్ అంటూ చెబుతోందట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. ఆయనకు జనంలో మంచి పేరు ఉంది. ఢీ కొట్టాలంటే ముత్తంశెట్టి సరైన క్యాండిడేట్ అని నమ్ముతున్నారు. ముత్తంశెట్టి సామాజిక వర్గం ఇక్కడ బాగా ఉండడం, ఎంపీగా కూడా జనాలకు పరిచయం ఉండడంతో రేపటి ఎన్నికల్లో నిలబెడితే గ్యారంటీగా గెలుచుకుని వస్తారని భావిస్తున్నారు. దీనికి ఎంపీ కూడా ఒకే అన్నట్లుగా టాక్. మొత్తానికి విశాఖ జిల్లాలో ఎంపీ, మంత్రి మధ్యన భీమిలీ సీటు తగవు ఇలా సెటిల్ చేయాలని పసుపు పార్టీ డిసైడ్ అయిందని భోగట్టా.

Similar News