రాజాగారి పరపతి తగ్గినట్లుందే....!!

Update: 2018-12-16 14:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇపుడు పూసపాటి గజపతుల చేయి దాటిపోయాయి. కొత్త రక్తం, కొత్త నాయకత్వం ఈ జిల్లాలో పురుడు పోసుకుంది. దాంతో గత కాలం వైభవంగా రాజుల రాజసం మిగిలిపోయేలా ఉంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఇపుడు మునుపటిలా జిల్లాలో హవా చాటలేకపోతున్నారు. ఆయనకు పార్టీలో పట్టు కూడా పూర్వం మాదిరిగా లేకుండా పోతోంది. ముఖ్యంగా 2014లో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడంతో స్థానికంగా సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దాంతో ఇపుడు ఆయన సైతం అందరి మాదిరిగా తనకు టికెట్ వస్తుందా అన్న టెన్షన్లో ఉంటున్నారు.

బొబ్బిలి రాజుల ప్రవేశం....

విజయనగరం జిల్లా రాజకీయాల్లో పూసపాటి వారికీ, బొబ్బిలి రాజులకు మధ్యన శతాబ్దాల వైరం ఉంది. 18వ శతాబ్దలో బొబ్బిలి యుధ్ధం కూడా ఈ రెండు రాజ వంశాల మధ్యన జరిగింది. ఇక రాజకీయల్లో చూసుకంటే స్వాతంత్రం రాకముందే బొబ్బిలి రాజులు మద్రాస్ స్టేట్ లో ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టి రికార్డ్ సృష్టించారు. ఇక పూసపాటి వారు రాజకీయ ప్రవేశం చేసిన తరువాత పీవీజీ రాజు పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా నెగ్గి సత్తా చాటారు. ఆ తరువాత ఆయన‌ కుమారులు ఆనందగజపతి రాజు, అశోక్ గజపతి రాజు టీడీపీలో చేరి రాణించారు. అశోక్ అయితే చాలాకాలం పాటు విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఇక ఇపుడు బొబ్బిలి రాజులు కూడా టీడీపీలోకి వచ్చేయడంతో వారి దూకుడు బాగా పెరిగింది.

గంటా పెత్తనం.....

ఈ నేపధ్యంలో విజయనగరం జిల్లా ఇంచార్జి మంత్రిగా విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు వ్యవహరించడంతో బొబ్బిలి రాజులతో ఆయన కలసి మరింతగా అశోక్ హవాకు గండి కొట్టడం ప్రారంభించారు. గంటా తనదైన రాజకీయం చేయడం ద్వారా సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూంటే బొబ్బిలి రాజుల రాకతో వారి సామాజికవర్గం కూడా ముందుకు దూసుకువస్తోంది. ఈ క్రమంలో క్షత్రియ సామజిక వర్గానికి చెందిన అశోక్ ప్రాభవం మెల్లగా తగ్గిపోతోంది. పార్టీలోనూ ఇదివరకు పరపతి లేదన్న మాట వినిపిస్తోంది.

ఎక్కడ నుంచి పోటీ....?

వచ్చే ఎన్నికల్లో అశోక్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఆయన ఎంపీకి వెళ్తారా, ఎమ్మెల్యేగా ఉంటారా అన్నది చంద్రబాబు డిసైడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఎంపీకి చేస్తే పూర్తిగా జిల్లా రాజకీయాలపై పట్టు పోతుంది. ఎమ్మెల్యేగా నెగ్గినా కూడా మంత్రి పదవి వస్తుందో రాదో తెలియని స్థితి. ఎందుకంటే ఈసారి గంటా విజయనగరం జిల్లా నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. గెలిస్తే ఆయనతో పాటు, బొబ్బిలి రాజు సుజయ క్రిష్ణ రంగారావు కూడా మంత్రి పదవి రేసులో ఉంతారు. మొత్తానికి ఎలా చూసుకున్నా రాజా వారికి రాజకీయంగా కానికాలమే వచ్చిపడిందని అంటున్నారు.

Similar News