ఇక్కడ ఎన్నికలయితే వీరికి టెన్షన్ ఎందుకో..?

Update: 2018-12-06 06:30 GMT

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆ హీట్ కన్పిస్తోంది. ఎన్నికలు తెలంగాణలోనైనా ఏపీ రాజకీయ నేతల్లో మాత్రం టెన్షన్ పట్టుకుంది. అక్కడ గెలుపుపైనే ఇక్కడ విజయం ఆధార పడి ఉంటుందన్న నమ్మకంగా అన్ని పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అంత ఆసక్తి పెరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎందుకు టెన్షన్ తో ఎదురు చూస్తున్నాయి. అవును... తెలంగాణ లోని రాజకీయ పార్టీ నేతలకంటే ఏపీ రాజకీయ నేతల్లోనే ఆ ఫలితాల కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారనేది వాస్తవం.

టీడీపీ అంచనా ఇదీ.....

ముఖ్యంగా తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే తమకు ఇక్కడ మార్గం సుగమమం అవుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుకే తెలంగాణ ఎన్నికల కోసం చంద్రబాబు చెమటోడుస్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది కేవలం 13 స్థానాల్లో మాత్రమే. అయితే అంకెలు బాబుకు ముఖ్యం కాదు. అక్కడ ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే దాని ప్రభావం ఏపీలో కూడా ఉంటుందన్నది చంద్రబాబు విశ్వాసం. అందుకోసమే మొత్తం కేబినెట్ ను తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ విజయం తమ నేత చంద్రబాబు సమర్థతకు నిదర్శంగా ఏపీ ప్రజలు భావిస్తారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే అక్కడ గెలిచి తీరాలన్న లక్ష్యంతో 24 గంటలూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందుకే ఏపీ టీడీపీ నేతలు అక్కడ ప్రజాఫ్రంట్ గెలవాలని మొక్కుకుంటున్నారు.

వైసీపీ లోపాయికారీగా.....

ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. అక్కడ టీఆర్ఎస్ గెలవాలని గట్టిగా కోరుకుంటోంది. తన ప్రధాన శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ మిలాఖత్ అయి పోటీ చేయడంతో ఆ పార్టీ టీఆర్ఎస్ కు విజయం సాధించాలని మొక్కుకుంటోంది. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ చేయకపోయినా అక్కడి ఆ పార్టీ క్యాడర్ కు మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేయాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు వైసీపీ క్యాడర్ నేరుగా టీఆర్ఎస్ కు మద్దతిచ్చింది. తమకు బలం ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు వైసీపీ నేతలు కృషి చేస్తున్నారన్నది వాస్తవం. జగన్ నేరుగా ప్రకటించకపోయినా ఆ పార్టీ క్యాడర్ మొత్తం గులాబీ వైపు మొగ్గు చూపిందనే చెప్పాలి.

కాంగ్రెస్ ఆశలు ఇవే....

ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఎన్నికలపైనే నమ్మకం పెట్టుకుంది. అక్కడ ప్రజాఫ్రంట్ విజయం సాధిస్తేనే ఏపీలో టీడీపీతో పొత్తు సాధ్యమవుతుందని నమ్ముతోంది. ఈసారి ఎన్నికల్లో కనీస స్థానాలను సంపాదించాలన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ఎన్నికలు కలసి వచ్చాయి. ప్రజాఫ్రంట్ అక్కడ గెలిస్తేనే బాబు ఇక్కడ పొత్తుకు మొగ్గు చూపుతారు. ఇక జనసేన పార్టీ కూడా కొంత కేసీఆర్ కు అనుకూలంగానే నడుచుకుంటోంది. జనసేన కూడా ఏపీలో నిలదొక్కునే ప్రయత్నంలో ఉండటంతో తెలంగాణ ఎన్నికల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొత్తం మీద తెలంగాణ ఎన్నికలు ఏపీ రాజకీయ పార్టీలకు టెన్షన్ తెచ్చిపెట్టాయనే చెప్పాలి.

Similar News