అంబేడ్కర్ పోయాడు.... ఎన్టీఆర్ వచ్చాడు..... !!

Update: 2018-12-13 09:30 GMT

అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధానిలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం., స్మృతి వనం, అంబేడ్కర్ స్ఫూర్తి భవనం ఏర్పాటు చేస్తామని 2016 ఏప్రిల్ 5న ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2017 ఏప్రిల్ 14న శంకుస్థాపన కూడా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం కోసం దాదాపు 210 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో బాబు అనుకూల సంఘాలు పెద్ద ఎత్తున సంబరాలు కూడా నిర్వహించాయి. ఆ తర్వాత విగ్రహ నిర్మాణం కోసం 97.69 కోట్లను విడుదల చేస్తున్నామని 2017 మార్చిలో గొప్పగా ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత కూడా అది అతీ గతి లేకుండా పోయింది. ప్రభుత్వం నిర్మిస్తోన్న పరిపాలన నగరానికి చేరువలో స్థలాన్ని కూడా గుర్తించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రావత్ 2017 మార్చి 20న ప్రకటించారు. పరిపాలనా నగరానికి వెళ్లే మార్గంలో మెటల్ కోటింగ్‌తో కాంక్రీట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. జీవం ఉట్టిపడే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన విగ్రహాల సరసన నిలిపే నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి స్వయంగా సిఆర్డీఏ సమీక్షలో సూచించారు. పరిపాలనా నగరానికి ఉత్తరాన ఎన్టీఆర్., దక్షిణాన అంబేడ్కర్ విగ్రహాలను నిర్మించాలని సూచనలు కూడా చేశారు. ఆ తర్వాత శంకుస్థాపన మాయమైపోయింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ విగ్రహం తెరపైకి వచ్చింది.

పటేల్ కంటే ఎత్తులో....

రాజధానిలో గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును నీరుకొండలో ఉన్న ఎత్తయిన కొండపై నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కొండపై 32 మీటర్ల ఎత్తున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ రూపొందించిన ఆకృతులను ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో చాలావరకు విరాళాలుగా సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రస్టు ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును పర్యాటకంగానే కాకుండా ఆ ప్రాంతాన్ని ముఖ్య వాణిజ్యకూడలిగా రూపొందించడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా నిర్మించాలని., కాంక్రీట్ విగ్రహం కంటే ఇది 30 శాతం ఎక్కువ ఖర్చు అవుతుందని, కానీ, దీర్ఘకాలం మన్నికలో ఉంటుందని., విగ్రహ నిర్మాణానికే రూ.155 కోట్లు అవుతుందని, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే నిర్మిత ప్రాంతానికి మరో రూ.112.5 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కించారు. విగ్రహం లోపలిభాగంలో పైవరకు వెళ్లి అక్కడి నుంచి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. లోపల ఎన్టీఆర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు. ఇంతవరకు దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఎత్తయిన విగ్రహంగా ఉందని, ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 253 అడుగుల ఎత్తుతో దాన్ని మించిపోనుందని బాబు చెబుతున్నారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని....

నీరుకొండలో ఎన్టీర్ విగ్రహ నిర్మాణం చంద్రబాబు ఆస్థాన సంస్థకి అప్పగించడంతో దాని నిర్మాణానికి ఢోకా ఉండకపోవచ్చు. మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా ఇదే సంస్థ చేపడుతోంది. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయడం ద్వారా నిధుల కొరత రానీయకుండా ఏర్పాటు చేస్తున్నారు. ట్రస్టుల ద్వారా విరాళాలను సేకరించడం సులువు కానుండటం., పన్ను మినహాయింపులు ఉండటంతో అయా సంస్థలకు కూడా కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా వీలవుతుంది. ఎన్నికల వేళ చంద్రబాబునాయుడు అంబేద్కర్ ను పక్కనపెట్టి ఎన్టీఆర్ ను తెచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News