లీడర్ సైకిల్ దిగ‌డం ఖాయం..!

Update: 2018-12-19 06:30 GMT

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోవ‌డం కామ‌న్‌. ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించేందుకు నాయ‌కులు నిత్యం ఏదో ఒక వ్యూహంతో ముందుకు క‌దులుతారు. ఇలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో దిట్ట‌గా.. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ బ‌ల‌మైన వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌లకు సంబం ధించి నిర్దిష్ట‌మైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆమంచి.. రాష్ట్ర విభ‌జ‌న వేడితో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించి కూడా అవ‌కాశం రాక‌పోవ‌డంతో స్వ‌తంత్రుడిగా బ‌రిలో నిలిచి గెలుపొందారు.

పార్టీలో విలువ లేదని....

ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితి నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు.. ఆమంచిని పార్టీలోకి ఆహ్వానించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీకి మద్దతిచ్చారు. ఈ ప‌రిణామం పై ఇప్ప‌టికే ఆమంచితో విభేదిస్తున్న స్థానిక టీపీకి నాయ‌కుడు పోతుల సురేష్‌ వ‌ర్గంలో మ‌రింత అల‌జ‌డి రేగింది. చంద్ర‌బాబు ఎన్నిమార్లు సూచించినా.. ఆమంచితో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రాలేదు. పైగా.. స్థానికంగా ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ఆమంచికి దూరం చేశారు. ఇవిలావుంటే.. త‌న వ‌ర్గానికి చెందిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం, నిర్బంధించ‌డం వంటి ప‌రిణామాల‌పై ఆమంచి ఆగ్ర‌హంగానే ఉన్నారు, దీంతో పార్టీలో త‌న‌కు విలువ లేద‌ని, త‌న‌ను ప‌ట్టించుకునేవారు కూడా లేర‌ని ఆయ‌న వాపోతున్నారు.

టీడీపీకి రాజీనామా చేయాలని...

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే టీడీపీకి రాజీనామా చేయాల‌ని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఈ విష‌యం తెలియడంతో వైసీపీ నాయ‌కులు ఆమంచిని త‌మ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జ‌న‌సేన నుంచి కూడా ఆయ‌న‌కు ఆఫ‌ర్లు ఉన్నాయి. అయితే, ఆమంచి మాత్రం ఏ పార్టీ లోకీ వెళ్ల‌కుండానే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. టీడీపీలో తాను నియోజ‌క‌వ‌ర్గ బాధ్యుడిగా ఉన్నా త‌న‌పై ఓడిపోయిన పోతుల సునీత‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో పాటు టీడీపీ జిల్లా నాయ‌క‌త్వం, అధిష్టానం ఆమెకు ప్ర‌యార్టీ ఇవ్వ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఆయన ధీమా ఆయనదే.....

ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన‌ట్టే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ స్వ‌తంత్రుడిగా గెలిస్తే ఎవ్వ‌రూ త‌న‌ను ప్ర‌శ్నించ‌ర‌న్న‌దే ఆయ‌న ధీమాగా క‌నిపిస్తోంది. దీనివ‌ల్ల తాను గెలిస్తే.. రెండు ర‌కాలుగా ఆయ‌న ప్ర‌యోజ‌నం సాధించే అవ‌కాశం ఉంది. ఒక‌టి త‌న‌కు పార్టీల‌తో సంబంధం లేకుండా స్వతం త్రంగా గెలిచే స‌త్తా ఉంద‌ని నిరూపించుకోవ‌డం, రెండు త‌న ఇష్టాన్ని బ‌ట్టి ఏ పార్టీలోకైనా జంప్ చేసేఅవ‌కాశం ఉండ‌డ‌మే మొత్తానికి ఈ సూత్రాన్ని గ‌ట్టిగా ప‌ట్టుకున్న ఆమంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే ఫార్ములాతో ముందుకు వెళ్తార‌ని, ఆయ‌న ఏపార్టీకి మ‌ద్ద‌తివ్వకుండా సొంత‌గానే పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Similar News