అఖిల కథ అడ్డం తిరుగుతుందా?

Update: 2018-12-29 11:00 GMT

మంత్రి అఖిలప్రియ తన తల్లి, తండ్రి పరచిన రెడ్ కార్పెట్ ను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారు. తన తల్లి దండ్రులకు సన్నిహితులైన వారందరినీ క్రమంగా దూరం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులో వచ్చిన మహత్తర అవకాశాన్ని అఖిలప్రియ చేజేతులా చేజార్చుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటేనే భూమా కుటుంబానికి పెట్టని కోట. శోభానాగిరెడ్డి జీవించి ఉన్నంత కాలం ఆమె ఆళ్లగడ్డను తన సొంత ఇంటిలా చూసుకున్నారు. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన శోభా నాగిరెడ్డి తర్వాత ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ విజయం సొంతం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తల్లితండ్రుల చూపిన....

తల్లి మరణం తర్వాత భూమానాగిరెడ్డి అండతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అఖిలప్రియ ఒంటరి అయిపోయారు. ఒంటరితనమో, తెలియనితనమో తెలయదు కాని... ఆళ్లగడ్డలో తనకు అనుకూలురైన వారందరినీ క్రమంగా దూరం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, తను ‘‘మామా’’ అని ఆప్యాయంగా పిలుచుకునే ఏవీ సుబ్బారెడ్డితోనే గొడవకు దిగారు. కొంత కాలం ఓపిక పట్టిన ఏవీ సుబ్బారెడ్డి తర్వాత అఖిలప్రియకు క్రమంగా దూరమయ్యారు. ఆళ్లగడ్డలో ఆమెకు వ్యతిరేకంగా కార్యక్రమాలను ప్రారంభించారు.

అందరితో వైరమేనా?

ఇక తాజాగా టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం కూడా అఖిలప్రియ వ్యవహారశైలి కారణమనిచెప్పక తప్పదు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తన తల్లి, తండ్రికి రాజకీయంగా సహకరించిన వారిని కలుపుకుని పోవాల్సింది పోయి.. వారితో అనవసరపు వివాదాలు పెట్టుకుంటున్నారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడా మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలి కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం టీడీపీలో చర్చనీయాంశమైంది.

సీరియస్ గా హైకమాండ్....

ఇప్పటికే ఏవీ, అఖిలప్రియ వివాదాన్ని సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పరిష్కరించాల్సి వచ్చింది. తాజాగా మరో నేత టీడీపీని వీడటం అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీని వీడుతుంటే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపు సాధించాలని అఖిలప్రియ అనుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అఖిల వ్యవహారం ఇలాగే కొనసాగితే ఆళ్లగడ్డలో అఖిలకు సీటు గల్లంతయ్యే సూచనలు ఉన్నట్లు సంకేతాలు ఇప్పటికే పార్టీ హైకమాండ్ పంపినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరికొందరు నేతలు పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు కర్నూలు జిల్లానేతలతో టెలికాన్ఫరెన్స్ లో సూచించినట్లు సమాచారం. మొత్తం మీద ఎన్నికల నాటికి అఖిల కథ అడ్డంతిరిగేలా ఉందన్న వ్యాఖ్యలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి.

Similar News